కథ – మానవత్వం

Crowded commute Photo by Rishiraj  Parmar from Pexels: https://www.pexels.com/photo/people-in-train-2706436/
Reading Time: 2 minutes

కథ – మానవత్వం

ఆ రోజు ఎర్రటి ఎండ. వేసవి కాలం. చెట్ల నీడను చూసుకుంటూ మెల్లిగా నడుస్తూన్న ప్రతిభకు చాలా దాహంగా ఉంది. తెచ్చుకున్న బాటిల్ నీళ్లు అయిపోయాయి. ప్రతిభ యూనివర్సిటీలో పీ జీ చదువుతోంది. డిగ్రీ సెలవుల్లో పెళ్లయింది. కానీ తన ఇంటరెస్ట్ తో పీ జీ చదువుతానంటే తన అత్తవాళ్ళు సరే నన్నారు. మధ్య తరగతిలో పుట్టిన ప్రతిభకు ఖర్చుల విలువ తెలుసు. అందుకనే ప్రతీ రోజూ ఆటో తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళిరావాలంటే కుదిరే పని కాదు.

యూనివర్సిటీకి పొద్దున్నే వెళ్ళేది ప్రతిభ. సాయింత్రం దాకా క్లాసులు ఉండేవి. ఒక్కోసారి మధ్యాహ్నమే క్లాసులు అయిపోయేవి. అందునా ప్రతిభకు మొన్ననే డాక్టరుగారు గర్భవతి అని చెప్పారు. సరే ఎలాగయినా పీ జీ పూరి చెయ్యాలనే దృఢ నిశ్చయంతో యూనివర్సిటీ వెళ్ళసాగింది ప్రతిభ. ఆ రోజు తనకు అసలు ఏమీ తినాలనిపించ లేదు. అదీ కాక క్లాసులు మధ్యాహ్నమే పూర్తి అయ్యాయి. బస్సు స్టాప్ లో చాలా సేపు బస్సు గురించి నిలబడింది ప్రతిభ. ఒక గంట నిలబడిన తరువాత కూడా బస్సులు రాకపోవడంతో కొద్దీ దూరం మరొక స్టాప్ వరకు నడుద్దామని బయలు దేరింది.

నడుస్తూ ఉంటే ఏమీ తిననందుకు  కడుపులో తిప్పడం ప్రారంభించింది. అక్కడక్కడా చెట్లు ఉండడంతో మెల్లిగా నడుస్తూ నీడ ఉన్న దగ్గర ఆగుతూ నడవసాగింది. దానికి తోడు దాహం వేయసాగింది. ఎక్కడా షాప్ కానీ నీళ్లు దొరికే వసతి కానీ కనిపించలేదు. తలా పైకెత్తి చూస్తే పగటి ఎర్రటి ఎండ. కళ్ళు తిరిగేటట్లుగా అనిపించింది. పడిపోతుందేమోనని తను అనుకోని అలాగా రోడ్డుపై కూర్చిండి పోయింది ప్రతిభ.  తలా మోకాళ్ళ మీద పెట్టుకుంది. ఎం చెయ్యాలో తోచని పరిస్థితి.

అప్పుడే ఒకతను వృధ్ధుడు చిన్న నీళ్ల బాటిల్ తో వఛ్చి “ఎమ్మా ఒంట్లో బాగోలేదా ” అని అడిగాడు. తలెత్తి పైకి చూసింది ప్రతిభ. అవును అన్నట్లుగా తలాడించింది. “ఈ మంచి నీళ్లు తీసుకోమ్మా..” అన్నాడు. అమృతంలాగా అనిపించి వెంటనే బాటిల్ తీసుకొని సగం బాటిల్ వరకూ నీళ్లు తాగేసింది. కొన్ని నీళ్లతో మొఖం తడి చేసుకుంది. “ఎమ్మా ఇలాంటప్పుడు ఏమైనా తినడానికి బ్యాగ్లో పెట్టుకోవాలమ్మా.

ఇక్కడ ఏమైనా కొనుక్కోవడానికి ఈ దారిలో షాపులు ఉండవని తెలుసు కదా” అని తన దగ్గరున్న ఏవో స్నాక్స్ ఇచ్చ్చాడు. కొంచం తిన్న తరువాత కొంచం తేరుకుంది ప్రతిభ. “నేను బస్సు గురించీ వెయిట్ చేస్తున్నానమ్మా” అన్నాడు. అతని మాటలు ఎక్కడో దూరం నుంచి వింటున్నట్టుగా అనిపించి ప్రతిభకు. అప్పుడనిపించింది ఇదంతా సరిగ్గా తాను తినక పోవడమే కారణం అని. “నువ్వు బస్సు గురించే వెయిట్ చేస్తున్నావా” అని అడిగాడు. అవునన్నట్టు తలాడించింది.

“అదిగో నాలుగు అడుగులు వేస్తే అదే బస్సు స్టాప్” అన్నాడు. కొద్దీ సేపు కాగానే ఒక బస్సు పూర్తిగా మనుషులతో నిండి రావడం చూసారిద్దరూ. “నేను ఆ బస్సు ఎక్కాలి” అన్నది ఆ ముసలాయనతో సన్న గొంతుతో. “కష్టపడి ఎక్కాలి. అస్సలు ఆ డ్రైవర్ ఆపుతాడో లేదో” అన్నాడు. ముసలతను చెయ్యి ఊపాడు బస్సును ఆపమని. బస్సు వచ్చ్చి ఆగింది వారిద్దరి ముందు.  బస్సు లోని వాళ్లు  “ఈ రోజు ఎదో స్ట్రైక్ జరుగుతోంది. ఇంకా బస్సులు ఈ రూట్లో  రావడంలేదు. ఎక్కాలనుకుంటే ఎక్కండి” అన్నారు. ఓ పది మంది దాకా జనాలు క్రింది దిగి వీరిద్దరికీ చోటు ఇచ్చ్చారు. బస్సు అంతా జనంతో నిండి పోయింది.

ఎలాగో ప్రతిభ ఆ ముసలతను కష్టపడి బస్సు ఎక్కారు. ఎంతో దీనంగా ఉన్న ప్రతిభను చూసి కూడా సీట్ల మీద కూర్చున్న ధృడమైన యువకులు ఒక్కరైనా లేచి సీట్ను ఇవ్వలేదు. కొన్ని సీట్లు స్త్రీలకు కేటాయించినా చక్కగా పురుషులంతా ఆ సీట్ల మీద దర్జాగా కూర్చున్నారు. అప్పుడిక ముసలతను ఆ యువకుల మీద అరిచాడు” మీకు ఏమైనా బుద్ధి ఉందా.. ఒక స్త్రీ ఇంత దీన స్థితిలో ఉంటె ఒక్కరైనా లేచి సీట్ ఇవ్వరా. ఇదేనా మానవత్వం. మీ చెల్లెళ్ళో అక్కలో లేదా అమ్మలో ఉంటే ఇలాగే చేస్తారా.. ఈ అమ్మాయి స్థితి చూస్తూ ఉంటే గర్భవతి లా ఉంది.. ఏది ఏమైనా ఒక్క అమ్మాయికి సీట్ ఇవ్వలేరా ..” అని. వెంటనే కొంత మంది లేచి ప్రతిభను కూర్చోమన్నారు. తన స్టాప్ వచ్చినప్పుడు తనని చెప్పమని కళ్ళు మూసుకుంది.

తన స్టాప్ రాగానే దిగి వెంటనే అక్కడి నుండి ఎలాగో అలా ఇల్లు చేరింది. తనను అలా ఆదుకున్న ఆ ముసలతను ఎవరో ..అతనికి తాను కనీసం థాంక్స్ అయినా చెప్పనందుకు బాధపడింది. ప్రతిభ కళ్ళు చెమర్చాయి. అతనిని దేవునిలా భావించి మనసులో కృతఙ్ఞతలు సమర్పించుకుంది. ఇలాంటి వాళ్ళ వల్లనే మానవత్వం ఇంకా ఈ ప్రపంచంలో  నిలిచి ఉంది అని అనుకుంది.  

Leave a Reply