కథ:- దీపం చెప్పిన కథ

Gray Lantern Photo by Pixabay from Pexels: https://www.pexels.com/photo/antique-board-burnt-close-up-262042/
Reading Time: 2 minutes

కథ:- దీపం చెప్పిన కథ

ఒక ఊళ్లో కొత్తగా పెళ్లయిన దంపతులు ఉండేవాళ్లు. వాళ్లెంతో అన్యోన్యంగా జీవించేవాళ్లు. భర్త పొలం పనులకు వెళితే భార్య ఇంటి పనులు చేసేది. ఇంటి వెనక కూరగాయలు పండించేది. సాయంత్రం వంట వార్పు అయ్యాక దీపం వెలిగించేది. పాత కాలంలో కరెంటు ఉండేది కాదు కదా! ఆ దీపం వెలుగులో ఇల్లంతా నిర్మలంగా నిగనిగలాడేది.

భర్త పేరు రాముడు.భార్య పేరు సీత. సీతకు ఎవరికీ తెలియని ఒక కథ తెలుసు. అయితే ఆమె ఆ కథను ఎవరికీ చెప్పలేదు. ఆమెకు ఒక మంచి పాట తెలుసు. కానీ ఇప్పటిదాకా ఆమె ఆ పాటను పాడింది లేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఎవరికి చెప్పకపోవడం వల్ల ఎప్పుడు పాడకపోవటం వల్ల ఆ కథ, ఆ పాట ఆమె లోపలే ఉండిపోయాయి. ఆమెలోపలే ఉండిపోవడం వల్ల వాటికి ఊపిరాడక అల్లాడిపోయాయి. బయటికి రాలేక ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఒకరోజు మధ్యాహ్నం సీత వంట చేసి భోంచేసి చాప వేసుకుని పడుకుంది. బయట నుంచి వచ్చిన చల్లగాలికి క్షణంలో నిద్రలోకి జారుకుంది. నిద్రలోకి వెళ్లే ముందు పెద్దగా ఆవలించి పడుకుంది. ఎన్నాళ్ళగానో ఆమె కడుపులో ఉండి ఊపిరాడక అల్లాడిపోతున్న కథ, పాట ఒక్కసారిగా బయటపడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాయి.

సీత నోట్లో నుంచి బయటపడిన కథ ఒక్కసారిగా ఇంటి వరండాలోకి వచ్చి చెప్పుల జతగా మారిపోయింది. పాట ఒక కోటుగా మారి చిలక్కొయ్యకు వేలాడుతూ ఉండిపోయింది. సాయంత్రానికి పొలం పనులు ముగించుకొని వచ్చిన రాముడు ఇంట్లోకి రాబోతూ తలుపు ముందున్న చెప్పుల జత చూసాడు. ఎవరో ఇంట్లో ఉన్నారు అనుకోని ఇంట్లోకి వచ్చాడు. ఎవరూ లేరు సీత ఒక్కతే ఉంది. అప్పటికే నిద్రలేచి బియ్యం ఏరుకుంటూ కనిపించింది. చిలక్కొయ్యకు వేలాడుతూ కోటు కనిపించింది. రాముడు “మన ఇంటికి ఎవరైనా వచ్చారా” అని అడిగాడు. సీత “ఎవరు రాలేదే” అంది. రాముడు “మరైతే ఆ చెప్పులు, కోటు ఎవరివి” అని అన్నాడు. ఆమె వాటిని చూసి అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు అంది.

రాముడికి మనసులో అనుమానం ఎక్కువైంది. వాటి గురించి పదేపదే అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా సీత నాకు తెలియదు అంది. ఇద్దరు బాగా ఘర్షణ పడ్డారు.రాముడు కోపంగా చాపా దిండు తీసుకొని దగ్గర్లోని ఆంజనేయ ఆలయానికి వెళ్లి పడుకున్నాడు.సీత ఏడుస్తూ రాత్రి ఒంటి గంటకి దీపమార్పి పడుకుంది. ఆ ఊరిలో దీపాలన్నీ రాత్రి పది గంటలకి ఆంజనేయుని గుడిలో చేరి ఊరి విశేషాలు ముచ్చటించుకుంటాయి.

రామయ్య ఇంట్లో దీపం రాత్రి ఒంటి గంటకి గుడి చేరింది. అన్ని దీపాలు “ఎందుకింత ఆలస్యం” అని అడిగాయి. రామయ్య ఇంటి దీపం “మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది అందుకని నేను రావటం ఆలస్యమైంది” అంది. “ఏమిటి విశేషం” అని అడిగాయి. మా యజమానురాలికి ఒక కథ, ఒక పాట తెలుసు. అయితే ఇప్పటిదాకా ఆమె కథను ఎవరికీ చెప్పలేదు. పాట పాడలేదు.

ఆమె కడుపులో ఉండిపోయిన అవి ఆమె నిద్రకూ ఆవలిస్తే ఇన్నాళ్లకు బయటికి వచ్చి చెప్పులుగా కోటుగా మారిపోయాయి. మా యజమాని వాటిని చూసి “ఇంటికి ఎవరు వచ్చారో చెప్పు” అని అడిగాడు. “ఎవరు రాలేదండి” అని చెప్పింది. గొడవపడి అతను ఇదిగో ఇక్కడే పడుకున్నాడు. ఆమె ఏడుస్తూ రాత్రి ఒంటి గంటకి గాని నిద్రపోలేదు. అందుకు ఆలస్యం అయింది అని చెప్పింది. నిద్రపోకుండా ఆలోచిస్తున్న రాముడు ఇదంతా విని భార్యని అనవసరంగా సందేహించానని ఇంటికి వెళ్లి భార్యను క్షమించమని కోరాడు.

Leave a Reply