సత్‌ సాంగత్యం

Meditation @pexels
Reading Time: < 1 minute

సత్‌ సాంగత్యం

అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన మాటలు అత్యంత విలువైనవి , అందరూ గుర్తుంచుకోవలసినవి, ఆచరించవలసినవి. ఆయన అంటాడు ‘ఉద్ధవా! నీవు నాకు సేవకుడవు, సఖుడవు, సహృదయుడవు. నీకొక రహస్యమైన విషయమును చెప్పెదను, వినుము. సత్సంగమనేది లోకంలో అన్ని విధాలైన ఆసక్తులను నశింపచేస్తుంది

యోగము, సాంఖ్యము, అనుష్టానము, స్వాధ్యాయము, తపస్సు, సన్యాసము, యజ్ఞయాగాదులు, వివిధములైన వైదిక కర్మలు, వ్రతాలు, పూజలు, రహస్యమగు మంత్రాలు, హోమనియమాలు, తీర్థయాత్రలు మున్నగు వాటన్నిటికన్నా సత్సాంగత్యానికే నేను త్వరగా వశుడనయ్యెదను. వేదాధ్యయనం చేయకనే, వ్రతాలు, అనుష్టానాలు చేయకుండా కేవలం సత్సాంగత్యం వల్ల నన్ను పొందిన వారిలో కొందరిని చెప్పెదను.

గోపికలు, వ్రజవాసులు, జంతువులలో గోవులు, వృక్షాలు, కాళీయాది మున్నగునాగులు, బృందావనంలోని చెట్లు చేమలు, లతలు నన్ను పొందగలిగాయి.. ఏ విధమైన సాధనలు చేయని ఆ గోపికలు కేవలము స్వర్శ, చేతనే పరబ్రహ్మ స్వరూపుడైన నన్ను పొందినారు. అట్లే నీవు కూడా స్మృతులను, విధి నిషేధాలను, వినకూడని విషయాలన్నీ వదలి నన్ను ఆశ్రయింపుము.

సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే ఎంతో సులభమైన మార్గాన్ని కేవలం ఉద్ధవునికే కాక మనకు సూచిస్తే మనం ఆయన మాటలను నిర్లక్ష్యం చేసి వృధా చేస్తూ, పునరపి జననం పునరపి మరణం అనుభవిస్తూ ఉంటే శ్రీకృష్ణ భక్తులం కాగలమా? ఆయనకు ఏది మన వశం చేయగలిగేది? సత్‌ సాంగత్యం.

సత్‌ ఏది? అసత్‌ ఏది? బయట కనపడే ఈ జగత్‌ అంతా అసత్‌, లోకమంతా అసత్‌. అందుకే లౌకికమైన వన్నీ మరీ ఈ సంసార సాగరంలో ముంచి తేలుస్తుంది. మరి సత్‌ ఏది? ఎక్కడుంది? చవు – పుట్టుకలు లేనిది. సత్యమైనది, నిత్యమైనది అదే సచ్చిదానందం మన లోపల ఉంది, మన హృదయంలో దాగుంది. అదే పరమాత్మ అదే శ్రీకృష్ణపరమాత్మ.

బయటికి పరుగులు తీయమని చెప్పక అంతర్ముఖులై అంతర్యామిని కలుసుకోమని చెబుతారో వారంతా సత్పురుషులే, వారితో సాంగత్యం సత్‌ సాంగత్యమే. ఆనాడు గోపికలకు, బృందావనంలోని చెట్లకు, చేమలకు శ్రీకృష్ణుని స్పర్శ లభించింది. ఆ అదృష్టం మనకు లేదే అని *నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యమై, సత్యమై మన హృదయాల్లో జ్యోతియై వెలుగుతున్నాడు. మనం అక్కడికి చేరాలి. అంతే!ఓమ్

Leave a Reply