వీరబాహుడి లోకజ్ఞానం

Wisdom Photo by Matheus Bertelli from Pexels: https://www.pexels.com/photo/woman-holding-fireflies-573299/
Reading Time: 2 minutes

వీరబాహుడి లోకజ్ఞానం

ఒక ఊరిలో అనసూయమ్మ సూరయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. అతనికి వీరబాహుడు పేరు పెట్టి  అల్లారు ముద్దుగా పెంచసాగారు దంపతులు. వీరబాహుడు పెద్దవయ్యాడే కానీ అతనికి లోకజ్ఞానం కానీ ప్రపంచంలో ఎలా తనను తాను నిలదొక్కుకొని బ్రతికే ఆలోచనగాని లేకుండా పెరిగాడు. చాలా అమాయకత్వంగా ఉంటూ బడికి వెళ్లకుండా తన  కంటే చాలా చిన్న వయసులో ఉన్న చిన్న పిల్లలతో ఆటలాడేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడుకాదు. తల్లిదండ్రులు కూడా వీరబాహుడిని వారి ప్రేమ కారణంగా ఎక్కువగా మందలించలేక పోయేవారు.

ఒకనాడు వీరబాహుడు వీధిలో చిన్న పిల్లలతో ఆడుకుంటుండగా అటువైపుగా ఆ రాజ్యానికి యువరాణి అయిన మదనసుందరి రధం రాసాగింది. వీధిలో వారంతా దారికి ఇరు ప్రక్కలా నిలబడి యువరాణికి జేజేలు జయ ధ్వానాలు పలుక సాగారు. వీరబాహుడు మాత్రం ఇదేదీ పట్టించుకొకుండా తన ఆటలో తాను మునిగి ఆడసాగాడు. ఇంతలో యువరాణి రధం దగ్గరకు రానే వచ్చింది. జనాలకందరికి యువరాణి  సంతోషంగా పలుకుతూ ముందుకు వెళ్ళ సాగింది రథంలో. ఆమె చూపులు వీరబాహుడి మీద పడ్డాయి. అతనొక్కడే జయజయ ధ్వానాలు చేయకుండా ఆడుకోవడం చూసింది.  వయసులో యువకుడిగా ఉన్న వీరబాహుడు చిన్న పిల్ల లతో ఆడుకోవడం వింతగానూ విడ్డూరంగాను తోచి రధాన్ని వారికి దగ్గరలో ఆపి వారికి చూడసాగింది.

కొంచెంసేపు అయ్యాక వీరబాహుడు యువరాణి తనను చూడడం గమనించగా యువరాణి అతనిని అవమానించే విధంగా చాలా పెద్ద నవ్వుతూ రధాన్ని ముందు సాగమని ఆజ్ఞాపించింది. ఇంత కాలంగా అతనిని ఈ విధంగా వెక్కిరించడం  అవమానించడం జరగలేదు ఆ ఊళ్ళో. అందరికీ అతనిమీద జాలి తప్ప.  కాబట్టి వీర బాహునికి ఆ ఘటన సంభమాత్సర్యాలలో ముంచెత్తింది. ఆ రోజంతా దీని గురించి ఆలోచించడం మెదలెట్టాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎలాగైనా సరే ఆ యువరాణిని వివాహం చేసుకొని ఆమెను తనకు జరిగిన ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. తెల్లవారి లేచి తన తల్లిదండ్రులకు చెప్పి దగ్గరలో ఉన్న యోగిపుంగవు దగ్గరకు వెళ్లి విద్యాబుద్ధులు నేర్చుకుంటానని యోగి ఆశ్రమానికి చేరాడు. అక్కడ ఆ ముని దగ్గర వేదాధ్యయనం, విద్య మరియు శాస్త్ర  జ్ఞానం సంపాదించుకున్నాడు.

తిరిగి తన  ఇంటికి బయలు దేరాడు. దారిలో వస్తుండగా, చాలా దాహం వేసింది.  ఒక పల్లె పిల్ల వీరబాహుడిని  ఆదరించి ఆతిథ్య మిచ్చ్చి గౌరవించింది . ఆ అమ్మాయి చేసిన సపర్యలు వారి తండ్రిగారు చేసిన సత్కారాలు వీరబాహుడిని ఎంతో ఆకర్షించాయి. దానికి తోడు ఆమె తెలివితేటలకు కరుణకు ముగ్ధుడైన వీరబాహుడు ఆమెను వివాహమాడాలనుకొని తన కోరికను ఆమెకు, వారి  తండ్రిగారికి తెలియజేశాడు.  వారిరువురూ ఒప్పుకోవడంతో వీరబాహుడు తన ఇంటికి చేరి తన వివాహాన్ని గురించి ఆ పల్లెపిల్ల గురించి చెప్పడంతో వారు కూడా అంగీకరించగా ఆ పల్లె పిల్లను వివాహమాడాడు.

ఒకనాడు  ఆ పల్లెపిల్ల మానసకు తనకు యువరాణితో జరిగిన ఘటనను చెప్పాడు. దానికి ఆమె “మరి మీరు ఆమెను ఎందుకు వివాహమాడి నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు” అని అడిగింది. దానికి వీరబాహుడు “మనిషిలోని నిజమైన తెలివి కానీ, జీవితం గురించి కానీ విద్యనభ్యసించిన తరువాత కానీ తెలియదు. అప్పటివరకు నేను తల్లిదండ్రుల దగ్గర చిన్నపిల్లవాడిలా బాధ్యత లేకుండా పెరిగాను. అప్పుడు జీవితం అంటే ఏమిటో తెలియదు. శాస్త్ర విద్యలు చేర్చుకున్న తరువాత నా తొందరపాటును తెలుసుకున్నాను. లోకజ్ఞానం, పాత్ర ,విచక్షణా జ్ఞానం, మరియు బాధ్యతలు తెలుసుకున్నాను. ఆ యువరాణి స్వభావమేమిటో తను కోరుకునేది ఏమిటో  తెలియకుండా స్వార్ధం గా ఆలోచించాను. ముని వద్ద శాస్త్రాలు నేర్చిన తరువాత కనువిప్పు కలిగింది “ అన్నాడు. దానికి మానస ఎంతో సంతోషపడింది.  

  .

.

Leave a Reply