ధర్మో రక్షతి రక్షితః

Hindu Culture Photo by Rahul  Puthoor from Pexels: https://www.pexels.com/photo/portrait-of-little-girl-wearing-traditional-makeup-8329747/
Reading Time: 2 minutes

ధర్మో రక్షతి రక్షితః

 ఒకానొక ఊర్లో మాధవయ్య బసవయ్య అనే ఇద్దరు వర్తకులు ఉండేవారు. వారు వర్తకం చేస్తూ డబ్బు సంపాదించుకునే వారు. నగరంలో సరుకులు తక్కువ మరియు లాభసాటి ధరలకు కొని తమ గ్రామంలో కొంత లాభం వచ్చేలాగా సరుకులను అమ్మి డబ్బు సంపాదించే వారు.

మాధవయ్య తాను ధర్మంగా వర్తకం చేసి డబ్బు సంపాదించే వాడు. ఏదో విధంగా అయినా సరే డబ్బు సంపాదించుకుంటే చాలు అనుకునే వాడు బసవయ్య. అదే విధంగా అధర్మ మార్గాల ద్వారా సరుకులు అమ్మడం ప్రారంభించాడు. ఎక్కువ లాభాలకు అమ్మడము, కల్తీ చెయ్యడము ప్రారంభించాడు. ఆ గ్రామంలో తక్కువ దుకాణాలు ఉండేవి. దానిని బసవయ్య అదనుగా తీసుకోని అత్యధిక లాభాలకు సరుకులను అమ్మి అమితంగా ధనం సంపాదించాడు.

ఆ విషయం మాధవయ్య తెలుసుకుని అతన్ని వారించడానికి ప్రయత్నించాడు. బసవయ్య తను బాగా డబ్బు సంపాదించింది తెలిసి కుళ్ళుమోతు తనంతో ఇలా మాట్లాడుతున్నాడని భావించాడు.  పైగా అతనితో “మాధవయ్యా నీ వర్తకం నువ్వు చేసుకో.  కానీ నా పనులకు మాత్రం నువ్వు అడ్డు రావద్దు అని” ఖచ్చితంగా చెప్పాడు. దాంతో మాధవయ్య అతనిని, అతని పనులను చూసి చూడనట్టుగా వదిలేశాడు. అదే అదనుగా తన తెచ్చిన సరుకులలో చాలా కల్తీ కలపడం ప్రారంభించాడు. తనకు లాభం వచ్చే విధంగా వర్తకం చేయ సాగాడు. దాంతో ఎవరైతే బసవయ్య దగ్గర సామానులు కొన్నారో వారందరికీ క్రమేణా జబ్బులు రా సాగాయి. ఇది తెలిసిన మాధవయ్య చూస్తూ మిన్నకుండి పోయాడు. ఏమీ చేయలేక పోయాడు. ఏదైనా అంటే తనకు ఆదాయం వస్తోందని మాధవయ్య కుళ్లుతున్నాడంటాడని అతడు ఊరుకున్నాడు.

 కొన్ని రోజుల తరువాత ఆ గ్రామంలోని వారందరికీ బసవయ్య సరుకులతో జబ్బులు పెరగడం గమనించిన గ్రామస్తులు బసవయ్య దగ్గరికి వెళ్లి అడిగారు “బసవయ్యా నీ వద్ద సామానులు కొన్న వారందరికీ ఆరోగ్యం క్షీణిస్తున్నది. ఇలా ఎందుకు జరుగుతున్నదంటావు” అని. దానికి బసవయ్య “ ఏమో ఇలా ఎందుకు జరుగుతుందో  నాకు ఎలా తెలుస్తుంది? నా సరుకులు అన్నీ మంచి వస్తువులే “ అని చెప్పాడు. సరైన ఆధారాలు లభించకపోవడంతో గ్రామస్తులు అతనిని ఏమీ చేయలేక పోయారు

 బసవయ్య ఒక్కగానొక్క కొడుకు రామయ్య. అతడికి ఈ మధ్యనే పెళ్లి జరిగి వేరే ఇంట్లో కాపురం ఉంటున్నాడు. అతడు చిన్న ఉద్యోగం చేసేవాడు. కొద్దిరోజుల తర్వాత బసవయ్య సరుకులను వాడడం మొదలు పెట్టాడు. అతనికి బసవయ్య చేసే పనుల గురించి తెలియదు. బసవయ్యకు తెలియకుండా సామానులు రామయ్య తన ఇంట్లో వాడసాగాడు. ఈ విషయం బసవయ్య కు తెలియదు. సామానులు వాడుకున్న తరువాత బసవయ్య కొడుకు రామయ్య కూడా జబ్బున పడ్డాడు. దానితో బసవయ్య చాలా ఆందోళన చెందాడు.

రామయ్యను డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళాడు.  డాక్టరుగారు “రామయ్య తిన్న వస్తువులు లో ఏదో కల్తీ జరిగినట్లు ఉంది. దాని వల్లే అతను ఆరోగ్యం పాడయింది. దీనికి చాలా ఖరీదైన మందులు, ఇంకా ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది” అని చెప్పాడు. దానికి బసవయ్య చాలా బాధపడి “డాక్టరు గారు మీరు ఎంత ఖర్చు అయినా సరే నా కొడుకు బతికించండి.ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను..”  అని అన్నాడు. దాంతో బసవయ్యకు చాలా ఖర్చు వచ్చింది. రామయ్య ఎలాగో దేవుడి దయవలన కోలుకున్నాడు. కోలుకున్న తరువాత బసవయ్య తన కొడుకు రామయ్యను  అడిగాడు.

“నువ్వు మీ ఇంట్లో వాడిన సామానులు ఎక్కడి నుంచి తెచ్చావు” అని.  అందుకు రామయ్య “అదేమిటి నాన్నా మీరు నగరం నుండి సరుకులు సామాన్లు తెస్తున్నారు కదా. మరొక షాపులో ఎందుకు కొంటాను. ఈ సామానులు అన్నీ మీరు తెచ్చినవే. అన్నీ నేను మీ దగ్గర తీసుకున్నాను. ఈ సంగతి మీకు తెలియనట్లుంది..” అన్నాడు.

 ఆ మాట వినగానే బసవయ్యకు నోట మాట రాలేదు. అప్పుడు అర్థమైంది ఇలా తాను కల్తీ చేస్తే మనుషులకు వారి ఆరోగ్యాలకు ఎంత ప్రమాదమో అని. ఆరోగ్యాల విషయంలో ఎంత చిక్కుల్లోపడతారు అని. ఇలా తను ఎంత మందిని బాధ పెట్టాడో కదా అని. తాను చేసినది ఎంత అధర్మమో అని తెలుసుకొన్నాడు. నెత్తీ నోరూ బాదుకున్నాడు. గ్రామస్తులు కూడా విషయం తెలుసుకుని వాళ్ళు ప్రభుత్వానికి చెప్పారు. ప్రభుత్వము ద్వారా అతనికి శిక్ష పడింది.

 కాబట్టి ధర్మ మార్గాల ననుసరించి చేసే పనులు ఎప్పుడూ క్షేమదాయకం. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. వర్తకులు అయినా ధర్మ ప్రకారమే వర్తకం కొనసాగించాలి. దానివల్లనే సమాజం బాగుంటుంది. అలాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది

Leave a Reply