కథ – ఏకాకి

Health Photo by Polina Tankilevitch from Pexels: https://www.pexels.com/photo/thermometers-on-white-surface-3873176/
Reading Time: 4 minutes

కథ – ఏకాకి

తనుజ కలము కాగితము తీసుకొని పడకగదిలో కిటికీ దగ్గర కూర్చుంది. పావన మూర్తి రాసిన ఉత్తరం తాలూకు భావోద్వేగపు సెగలు కొంత చల్లారి తనుజ కొంత శాంతి పొందింది. తల పక్కకు తిప్పి చూసింది మంచం మీద తన భర్త జీవచ్ఛవంలా నిద్రపోతున్నాడు. తన భర్తకు భగవంతుడు సవరించలేనంత శిక్ష వేశాడు. ఆ శిక్ష అతను ఒక్కడికే వేసి ఉంటే అతను అంత బాధపడకపోవును. అతని భార్యకు కూడా అదే శిక్ష వేశాడు. తనుజ కళ్లు చమర్చాయి. గతంలోని అతని దురాగతాలు గుర్తుకు వచ్చి మనసు కఠినంగా మారిపోయింది. ప్రసాదరావు అనే ఆ మృగం మీద జాలి పడటం తప్పేమో అనిపించింది. కానీ అతనితో పాటు తనకు ఎయిడ్స్ అని తెలిసిన దగ్గర నుంచి తన కారణంగా తన భార్య జీవితం కూడా బలైపోయింది అన్న నిజాయితీతో కూడిన పశ్చాతాపాన్ని అతను కొంతకాలంగా తీవ్రంగా అనుభవిస్తుండటం గుర్తుకొచ్చి తనూజ మనసు మరల మెత్తబడింది.

అరే…ముందు పావన్ కి లెటర్ రాసి పోస్ట్ చేయాలని గుర్తొచ్చి కలం సరిగా పట్టుకొని రాయటం మొదలుపెట్టింది.

డియర్ పావన్…. ఏం….రాయాలో

ఎలా రాయాలో….

తనుజకు అర్థం కావడం లేదు. ఎడమచేత్తో తల పట్టుకుంది. ఏం తలంపుకు రాలేదు. పావన మూర్తి రాసిన ఉత్తరాన్ని తీసి మరోసారి చదవటం మొదలుపెట్టింది. స్నేహశీలి తనుజకు పావనమూర్తి రాయు లేఖాంశాలు… ఉభయ కుశలోపరి. నీకిలా లేఖ రాయవలసిన పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు తప్పనిసరి రాస్తున్నాను. ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందని అందరూ అంటున్నారు. కానీ మనిషి ఏకాకి అయిపోయాడు. అది ఎవరు గుర్తించడం లేదు. నా ఆస్తి ఎలా తరిగిపోయింది అన్నది పక్కన పెట్టేయ్… కానీ నా ప్రేమను కాలరాసేసి నా ఆస్తికోసం తమ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేసిన నా అక్క బావ కూడా వాళ్ళ కూతురు కోసమైనా కన్నెత్తి చూడటం లేదు.

నేడు నా కూతురు కడుపునిండా తిండి లేక వయసు తెచ్చిన శరీరాన్ని కప్పుకోవడానికి గుడ్డ లేక నరకయాతన అనుభవిస్తుంది. నేను, నా భార్య దాని ముఖంలోకి చూడలేకపోతున్నాం నన్నెందుకు కన్నారు అని అడుగుతుందేమోనని క్షణక్షణం మరణ భయాన్ని పొందుతున్నాం. ఆ బెంగతోనే నా భార్య మంచాన పడింది. ఆమె బ్రతకాలంటే 50,000 కావాలి. చూడు…తనుజ నేను ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు. నిన్ను కాబట్టే ధైర్యం చేసి అడుగుతున్నాను. నా నుంచి లక్షలకు లక్షలు సహాయం పొందిన వారిని సైతం నేనిచ్చిన దానిలో ఎంతోకొంత తిరిగి ఇవ్వమని అడగలేక పోయాను. కానీ నువ్వు నా దగ్గర అప్పుగా తీసుకున్న 50,000 తిరిగి ఇవ్వగలవేమోనని గత్యంతరం లేక అడుగుతున్నాను.

ఇప్పుడు మీ భర్త వ్యసనాలకు అలవాటు పడి ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు నేను స్నేహితుడిగా సహాయం చేస్తానంటే నువ్వు అప్పుగా అయితేనే తీసుకుంటాను అన్నావు. ఏదో విధంగా నీ ఇబ్బంది తీరటమే ప్రధాన అనుకొని ఆరోజు ఇచ్చాను. ఈరోజు నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావన్న ధైర్యంతో అడుగుతున్నాను. ఆరోజు అప్పుగానే అని అన్నావు కాబట్టి ధైర్యం చేసి అడుగుతున్నాను. వీలైతే ఆ 50,000 పంపించగలవా.ఈ పాత విషయాన్ని చెప్పకుండా ఒక స్నేహితురాలుగా నన్ను సహాయం చేయమని అడిగితే బాగుండును కదా! అని నీకు అనిపించవచ్చు అయితే భార్యలకు వాళ్ళ స్నేహితులకు సహాయం చేసే అంత ఆర్థిక స్వేచ్ఛ అప్పుడే రాలేదని భావించి నా అప్పు తీర్చమని అడగవలసి వచ్చింది. ఏమైనా నిన్ను ఇప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించమని ప్రార్థిస్తున్నాను ఉంటాను ఇక.

మీ స్నేహితుడు
పావనమూర్తి.

తనుజ ఏడుపు ఆపుకోలేకపోయింది. అప్పటికి ఆ లేఖను మూడుసార్లు చదివింది. మొదటి రెండుసార్లు ఏడుపు ఆపుకుంది. జవాబు రాయాలంటే మనసు కొంత తేలిక పడాలి. అందుకే ఈసారి ఏడుపు ఆపుకునే ప్రయత్నం చేయలేదు. “పావన్…”అంటూ బాధగా కుర్చీలో వెనకకు చేరబడింది. తాను మొదలుపెట్టిన లేఖను కొనసాగించింది.మీ దగ్గర అప్పుగా తీసుకున్నాను.కాబట్టి తీర్చాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ తీర్చలేకపోయాను.మీ దగ్గర నాకు దాపరికం ఏముంది. అసలు విషయం చెబుతున్నాను నాకు మా వారికి ఎయిడ్స్. ఈ విషయం తెలిసిన మూడో వ్యక్తివి నీవే. కలసి మెలసి ఉన్నంత మాత్రాన ఆ వ్యాధి అంటుకోదని తెలిసిన ఆ వ్యాధిగ్రస్తులని అంటరాని వారిగానే చూస్తున్నారు. అంతటితో ఆగటం లేదు వారి పిల్లలకు ఆ వ్యాధి లేకపోయినా వారిని కూడా దూరంగా ఉంచుతున్నారు.

అందుకే హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మా అమ్మాయికి ఏ ఇబ్బంది రాకుండా ఉండటానికి మా వ్యాధిని రహస్యంగా ఉంచాం. ఇంకో సంవత్సరంన్నరలో మా అమ్మాయికి ఇంటర్ పూర్తవుతుంది. నేను పనిచేసే కంపెనీ ఎండి గారితో మాట్లాడాను. నేను చనిపోతే నా ఉద్యోగం నా కూతురికి ఇవ్వాలని… నా ధోరణికి మొదట ఆయన విస్తుపోయిన నా పర్సనల్ విషయాలను చర్చించకూడదనుకున్నారు కాబోలు… ఏం ప్రశ్నించకుండా సరే అన్నారు. ఈ సంవత్సరంన్నర బ్రతకటానికి మేము వాడుతున్న మందులకు నా జీతం సరిపోవటం లేదు. కొద్దో గొప్ప ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ వాడేసాం. మీ అక్క,బావ విషం తాగుతున్నారని నన్ను నా కర్మానికి వదిలేసి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు.

అక్కడితో నువ్వు ఆగితే బాగుండును. మా నాన్న నీ మీద పంతంతో తీసుకొచ్చిన ఈ ప్రసాదరావును నేను చేసుకోనంటే నువ్వే వచ్చి నన్ను ఒప్పించావు. మనసులోంచి నిన్ను తుడుపుకోలేకపోయినా మెడలో ఈ ప్రసాదరావుతో తాళి కట్టించుకున్నాను. మెడలో తాళి పడిన దగ్గర నుంచి మీ ఆలోచనలను తగ్గించుకుంటూ నా జీవిత భాగస్వామి ఆలోచనలతోనే మనసంతా నింపుకోవటానికి ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా అతను కష్టాలు బాధలను ఇప్పుడు ఎయిడ్స్ ని ప్రతి కానుకలుగా ఇచ్చాడు నాకు. కానీ ఇవన్నీ రాస్తే పావన మూర్తి చాలా బాధపడతాడని భావించి రాయకూడదు అనుకుంది.

తాను రాసిన “డియర్ పావన్…” అన్న రెండు మాటలను చదివి వాటి పక్కన మరో కొన్ని పదాలను చేర్చింది.”మీ అప్పు తీర్చే స్థితిలో నేను లేను ఇప్పుడే కాదు ఎప్పటికీ తీర్చలేను” అన్నవి ఆ పదాలు వెంటనే ఆ కాగితాన్ని మడచి కవర్లో పెట్టి జిగురుతో కవర్ మూసేసింది. ఆ వెంటనే చిరునామా రాసి తపాలా బిళ్ళను అతికించి పర్లాంగు దూరంలో ఉన్న తపాలా పెట్టే దగ్గరకు వెళ్లి అందులో వేసి హృదయం నిండా ఊపిరి పీల్చుకుంది. పవన్ నీలాంటి ఉత్తముడిని ఏకాకిని చేయటం ఈ సమాజం దురదృష్టం. నీ భార్య బ్రతుకుతుంది.నిన్ను ఇప్పుడు నిర్లక్ష్యం చేసిన వారు మీ దర్శనం కోసం పడిగాపులు పడే రోజు వస్తుంది కూడా. అప్పటికి నేను ఉండను. కానీ నా మరణం తర్వాత నేను దుర్మార్గురాలను కాదని తెలుసుకుంటావని ఆశ ఆనందాన్నిస్తోంది అని అనుకొని తేలిక పడ్డ మనసుతో ఇంటికి బయలుదేరింది.

తనూజ ప్రసాదరావు చెరో మంచం మీద పడుకుని ఉన్నారు. వారి ముఖాల్లో మృత్యువు ప్రతిబింబిస్తున్నది. వారిద్దరి మధ్య కుర్చీలో కూర్చున్న పావన మూర్తి “ఎంత పనిచేశారు ప్రసాదరావు గారు. మీరు నాకు 50,000 తెచ్చి ఇచ్చినప్పుడు నాకు ఈ విషయం చెప్పకపోవడం దారుణమండీ! నేను తనుజకు రాసిన ఉత్తరం మీరు చదివి మీరు గతంలో ఉద్యోగం చేసిన కంపెనీ యజమానితో మాట్లాడి మీ వైద్యం నిమిత్తం మీకు 50,000 మంజూరు చేసేట్లు చేసి ఆ 50,000 నాకు తెచ్చి ఇస్తారా. నా భార్యకు వైద్యం ప్రభుత్వం తలపెట్టిన ఒక పథకం ద్వారా జరిగేట్లు ఒక డాక్టర్ గారు ఉపకారం చేసినా మీ డబ్బు మీకు తెచ్చి ఇవ్వని దుర్మార్గుడిని నేను.

ఆ డబ్బుతో షేర్ల బిజినెస్ చేసి అంబానీ సోదరుల గొడవ తేలిన సందర్భంలో షేర్ల ధరలు విపరీతంగా పెరగటంతో ఒక్క సంవత్సరంలోనే కోటీశ్వరుని అయ్యాను. కానీ మీరు ఇక్కడ సరైన మందులు వాడలేక ఎంతో బాధను అనుభవిస్తూ జీవించగలిగే నెలలను కోల్పోయారు. నేను ఎంత పాపినయ్యానండీ! అంటూ వస్తున్న కన్నీటిని తుడుచుకున్నాడు. తనుజ భర్త వైపు ఎంతో మెచ్చుకోలుగా చూసింది.పావనమూర్తి వైపు “నువ్వు మంచి వాడివి. నీకు మంచే జరుగుతుంది” అన్నట్లు చూసి కళ్ళు మూసుకుంది.ఇంక తెరవలేదు.”తనుజ” అంటూ పావనమూర్తి తనుజను తట్టి లేపాడు. కానీ ఆమె లేవలేదు. ఈసారి “తనుజ”అంటూ బిగ్గరగా ఏడ్చాడు. ప్రసాదరావు కన్నీళ్లు తుడుచుకుంటూ “తాను ముందు వెళ్లిపోయి నన్ను ఒంటరిని చేసేసింది. ఆమెకు దహన సంస్కారాలు జరిపే భాగ్యం లభించినందుకు ఒక రకంగా సంతోషమే” అన్నాడు.

శవాన్ని మోయటానికి ఎవరూ లేరు పావనమూర్తి శవాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లి తన కారులో వెనక సీట్లో పడుకోపెట్టాడు. ప్రసాదరావుని‌ తీసుకెళ్లి కార్లో తన పక్క సీట్లో కూర్చోబెట్టుకొని స్మశానానికి బయలుదేరాడు. నా కూతురు బాధ్యత నీదే అన్నాడు ప్రసాదరావు. ప్రసాదరావు చితి అంటించాడు. మంటలు చెలరేగాయి “నేను ఏకాకిగా బ్రతకలేను” అంటూ ఆ మంటల్లో పడిపోయాడు. దిగ్భ్రాంతుడైన పావనమూర్తి అతి కష్టం మీద అతన్ని బయటికి తీశాడు.అప్పటికే ప్రసాదరావు చాలా వరకు కాలిపోయాడు. పావనమూర్తి చేతిలో ప్రాణం విడిచాడు.

భార్య చితిలోనే భర్త శవాన్ని వేసి కాటి కాపరిచేత మరిన్ని కట్టలు తెప్పించి వేసి శవాలు పూర్తిగా కాలే వరకు ఉండి పావనమూర్తి కారు దగ్గరకు బయలుదేరాడు. చచ్చిన తర్వాత మోయటానికి నలుగురు మనుషులు కూడా లేనంత ఏకాకిగా మనిషి ఎందుకు అవుతున్నాడు అని పావన మూర్తి ప్రశ్నించుకున్నాడు.పెచ్చు పెరుగుతున్న స్వార్థం అన్న జవాబు స్పూరించింది. తనుజ కూతురిని తన కూతుర్ని ఈ స్వార్థానికి అతీతంగా పెంచి వాళ్ళ స్నేహాన్ని ప్రపంచానికి ఆదర్శం అయ్యేలా చేయాలనుకుంటూ కారు డోరు తెరిచాడు.

చితి మీద నుంచి వచ్చిన వెచ్చని గాలి అతని ఆలోచనలను మెచ్చుకుంటున్నట్లుగా తాకింది.

Shop Chandamama for great products : Chandamama Website

Leave a Reply