అద్భుతాల ఆలయం – పూరీ జగన్నాథ్

Lord Jagannath By Ben30ghosh - Own work, CC BY-SA 4.0, https://commons.wikimedia.org/w/index.php?curid=60104067
Reading Time: 2 minutes

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో  అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీలేంటో ఓసారి తెలుసుకొండి… ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.

జెండా
ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ.. ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో ఊగుతుంది.

చక్రం
పూరీ జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరీలో ఎక్కడ ఉండి అయినా సరే.. ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే.. అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. అది ఆ చక్రం ప్రత్యేకత.

అలలు
సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపునకు ఉంటుంది. పగటి పూట అలా వీస్తుంది. సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపునకు వీస్తుంది. కానీ.. పూరీలో మాత్రం అంతా రివర్స్. దానికి విభిన్నంగా గాలి వీస్తుంది.

పక్షులు
జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఆలయం పైకి పక్షులు వెళ్లవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు.. అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు.

గోపురం నీడ
జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా.. సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. దీని నిర్మాణం అలా ఉంటుందా? లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా? అనేది మాత్రం అంతు చిక్కడం లేదు.

ప్రసాదం వృథా చేయరు
పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరు. మొత్తం తినేస్తారు.

అలల శబ్దం
సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే.. సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది

రథ యాత్ర
పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే. పూరీ రథ యాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలు ఉంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.

రథాలు
పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి.

బంగారు చీపురు
రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.

విగ్రహాలు
ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు.

గుండీజా ఆలయం
ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే.. గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీలాగానే ఉండిపోయింది.

దేవుడికి ప్రసాదం
పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. వాటిని మట్టి కుండల్లో వండుతారు. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు. రుచి కూడా ఉండదు కానీ.. దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలకు ఘుమఘుమలాడుతాయి. ఎంతో మధురంగా ఉంటాయి ప్రసాదాలు.

Leave a Reply