కథ:-అంతా నేనే… అన్నీ నేనే

Indian Family Photo by Yan Krukau from Pexels: https://www.pexels.com/photo/a-happy-loving-family-8819155/
Reading Time: 3 minutes

కథ:-అంతా నేనే… అన్నీ నేనే

విమలతో వివాహమయ్యేటప్పటికి జగన్నాధానికి చిన్న కిరాణా షాపు ఉండేది. అతను నెమ్మదిగా వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాడు.కిరాణా షాపు స్థానంలో సూపర్ మార్కెట్ వెలిసింది.ఆ సూపర్ మార్కెట్లో వచ్చిన లాభాలతో ఇంకొక సూపర్ మార్కెట్ పెట్టాడు.క్రమేపీ నగరంలో పది సూపర్ మార్కెట్లకు అధిపతి అయ్యాడు.ప్రతి సూపర్ మార్కెట్లోనూ బియ్యం,పప్పులు,సబ్బులు వంటి కిరాణా సామాన్లే కాకుండా కూరగాయల సెక్షన్, పళ్ళ, మాంసం,చేపలు,బేకరీ ఉన్నాయి. ఆధునిక గృహినికి వరప్రసాదం జగన్నాథం నడిపే సూపర్ మార్కెట్ల సముదాయం.

అయితే జగన్నాథం భార్య విమలకి మాత్రం అతనితో జీవితం వరంలా కనిపించలేదు. ప్రతి విషయంలోనూ జగన్నాథం తన మాటే నెగ్గి తీరాలనుకునేవాడు.పెళ్లయిన కొత్తలో విమల ఆ విషయం అంతగా పట్టించుకోలేదు.ఇల్లు దిద్దుకోవటంలో పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో ఆమెకు సమయం గడిచిపోయేది.పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఆమెకు పని తక్కువై కాలం గడవడం కష్టమైంది.ఆమె కంప్యూటర్ కోర్సులో చేరి చదువుకుంటానని భర్తని అడిగింది.జగన్నాథం ఒప్పుకోలేదు.తన భార్య గడప దాటి బయటకు వెళ్లడం అతని ఇష్టం లేదు.

వీధిలోకి వెళ్లడం ప్రారంభిస్తే ఆమె తన మాట వినదని అతని అభిప్రాయం. విమల మధ్యాహ్నం పూట ఉండే పార్ట్ టైం కోర్సులో చేరుతానని ఇంట్లో పనికి ఏ విధమైన లోటు రానివ్వనని నచ్చ చెప్పింది. ఆమె చాలాసార్లు అడిగాక జగన్నాథం అతి కష్టం మీద ఒప్పుకున్నాడు.విమల కోర్సులో చేరింది.రెండు నెలలకే జగన్నాథం ఆమె చేత కోర్సు మాన్పించేసాడు.కారణం అడిగిన విమలకి “ఏవైనా ముఖ్యమైన ఫోన్ కాల్స్ నువ్వు ఇంట్లో లేనప్పుడు రావచ్చు కదా” అన్నాడు.

విమల ఇంట్లోనే ఉండి చదువుకుంటానని చెప్పి కరస్పాండెంట్ కోర్సులో చేరింది. జగన్నాథం ఆమెను చదువుకొనివ్వలేదు. విమల చాలా బాధపడింది.భర్త ఎప్పుడూ ఇంతే తాను ఒక్కతే స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటానికి ఒప్పుకునేవాడు కాదు. తనకిష్టం లేని పార్టీలకి మీటింగులకి తీసుకెళ్లేవాడు.విమలలో అసంతృప్తి పెరిగి ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి. కోపం వచ్చినప్పుడు జగన్నాథం చేతిలో ఏది ఉంటే అది విసిరేసేవాడు. ఇంట్లో పరిస్థితి దుర్భరమైపోయింది. చివరకు ఒకరోజు దుర్భర పరిస్థితి పరాకాష్టకు చేరుకుంది.ఆ రోజేమైందంటే….

విమల,జగన్నాథం తెలిసిన వారి ఇంట్లో పెళ్లికి వెళ్లారు. విమల ఇంటి నుంచి వెళ్ళింది. జగన్నాథం సూపర్ మార్కెట్ నుంచి కళ్యాణ మండపానికి వచ్చాడు. పెళ్లిలో ఆడవాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడుతున్న విమలని పిలిచాడు. విమల భర్త దగ్గరకు వెళ్ళింది. “విమల ఏమిటంతా లోనికి జాకెట్ వేసుకున్నావు ఇంటికెళ్లి వేరే జాకెట్ వేసుకురా”అని అన్నాడు. “ఇప్పుడు వెళితే ఏం బాగుంటుందండి ఈ చీరకు ఇంకో మ్యాచింగ్ బ్లౌజ్ లేదు కదా”అని చెప్పింది. “మ్యాచింగ్ అంత ముఖ్యం కాదు ఇంటికెళ్లి మార్చుకురా”అన్నాడు.

“ఇప్పుడు వెడితే బాగుండదు నేను వెళ్ళను”.

” వెళతావా ? లేదా ?” జగన్నాథం గట్టిగా అరిచాడు.

Photo by viresh studio from Pexels: https://www.pexels.com/photo/group-of-people-gathering-inside-room-2060240/

పెళ్లి పందిట్లో అందరూ తలతిప్పి జగన్నాధం వైపు చూశారు. విమల సిగ్గుతో చచ్చిపోతుంది. “నెమ్మదిగా మాట్లాడండి ఇప్పుడు ఇంటికి వెళ్లడానికి ఏం కారణం చెప్పను” అని అన్నది.

ఈ జాకెట్ అంత అసభ్యంగా లేదు అంతగా మీకు అభ్యంతరమైతే కొంగు‌ కప్పుకుంటాను. జగన్నాథం రెచ్చిపోయాడు. “మాటకు మాట చెప్పటం బాగా నేర్చుకున్నావు. నీలాంటి వాళ్లకు మాటలతో లాభం లేదు” అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బరబరా బయటకు ఈడ్చుకెళ్ళి కారులో పడేశాడు. పెళ్లికి వచ్చిన వారంతా ఈ సంఘటన చూసి కదలకుండా ఉండిపోయారు. ఇల్లు చేరాక జగన్నాథం విమలను నానా తిట్లు తిట్టాడు.ఓర్చుకోలేని విమల “మీరు ఇలాగే ఉంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను” అన్నది.జగన్నాథం పిచ్చివాడైపోయి బాత్రూంలోకి వెళ్లి తలుపులు బిడాయించుకున్నాడు. “ఇదిగో నేనే స్విచ్ లో చెయ్యి పెడతాను షాక్ కొట్టి చస్తాను అప్పుడు వెధవ ముండవై పుట్టింటికి పోదువు గాని” అని అరిచాడు. విమల ఏడుస్తూ బాత్రూం తలుపు తీయమని వేడుకొంది. జగన్నాథం అరుపులు మానలేదు.చివరకు విమల ముందు జాగ్రత్తగా కరెంటు ఆపేసింది.తన అన్నకి ఫోన్ చేసి రప్పించింది. కొంతసేపటికి జగన్నాథం బాత్రూం తలుపులు తీసుకొని బయటికి వచ్చాడు. భార్య,బావమరిది బలవంతం చేస్తే సైకియాట్రిష్టుని చూడ్డానికి ఒప్పుకున్నాడు. సైక్రియాటిస్ట్ విమల చెప్పిన సంగతులు, జగన్నాథం చెప్పిన విషయాలు మొత్తం విన్నాడు.

పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక భార్య వ్యాపకాలు పెంచుకోవడం వల్ల ఇంట్లో కొన్ని స్పర్ధలు ఏర్పడటం సహజమే. కానీ ఇది మామూలు వైవాహిక సమస్య కాదు. జగన్నాథంలో తన మాట తప్ప ఇంకేమీ నెగ్గ కూడదన్న భావం బలంగా ఉంది. తన గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించని తత్వం అతనిది. భార్యకి అసలు వ్యక్తిత్వమే ఉండకూడదని, ఆమె వేసుకునే బట్టలు కూడా తన ఇష్టమేనని నమ్ముతాడు. తను తన మాట నెగ్గనప్పుడు బాత్రూంలో తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు అంటే అతనికి ఎవరితోనూ సర్దుకుపోవటం రాదన్నమాట. జగన్నాథంది నార్సిసిస్టిక్ డిసార్డర్ అయి ఉంటుందని సైక్రియాటిస్ట్ అనుకున్నాడు. విమల సైక్రియాటిస్ట్ అని మీరు చెప్పిన నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఈ మధ్యనే వచ్చి ఉంటుందా అని అడిగింది. లేదు ముందు నుంచి మీ వారి పర్సనాలిటీ ఇలాగే ఉంటుంది. అయితే మీరు ఇదివరకు గృహ నిర్వాహణకి పిల్లల పెంపకానికి అంకితమైనంత వరకు ఈయనకు ఏ బాధ లేదు. మీరు మీ అభివృద్ధిని కోరుకున్నప్పటినుంచి కష్టాలు అన్నాడు సైక్రియాటిస్ట్వి.మల నిజమే అనుకుంది. కొంతకాలం జగన్నాధానికి బిహేవియర్ థెరపీ, ఇద్దరికీ మారిటల్ థెరపీ జరిగితే పరిస్థితి బాగుపడుతుందని డాక్టర్ చెప్పాడు.

విమలలో ఆశాకిరణాలు ఉదయించాయి.

Leave a Reply