కథ:-అంతర్వాహిని

Handicap Girl Photo by cottonbro studio from Pexels: https://www.pexels.com/photo/person-with-red-cape-sitting-on-wheelchair-6195469/
Reading Time: 2 minutes

కథ:-అంతర్వాహిని

ఆమెకు అంగవైకల్యం ఉందని వద్దన్నా వాడే మనసు మార్చుకు వచ్చాడు.అయితే ఈసారి తిరస్కరించటం ఆమె వంతయింది కానీ ఎందుకు…?

గాలిపటానికి గల దారం తెగిపోతే అది ఎగురుకుంటా పోయి ఎక్కడ పడుతుందో తెలియదు. ఉదజనితో నిండిన బెలూన్ ఆకాశం పైకి వదిలితే ఉదజని ఉన్నంతసేపు గగన విహారం చేస్తూ ఉదజని అయిపోయాక ఎక్కడో కూలిపోతోంది. తమ మైత్రికి గాలిపటం లాగా బెలూన్ లాగా సగంలోనే విగతం కలగకుండా ఉండాలంటే శాశ్వతమైన బంధుత్వం ఏర్పరచుకోవాలి. ఇది ఇందిర తండ్రి, చతురాననం తండ్రి ఒకరికి తెలియకుండా ఒకరు తీసుకున్న నిర్ణయం ఒక శుభ దివసాన ఇందిర తండ్రిని చూసి “చాలా రోజుల నుంచి నీతో ఒక ముఖ్య విషయం ముచ్చటించాలనుకుంటున్నానురా ఇప్పుడు సమయం చిక్కింది మీ అబ్బాయిని మా అల్లుడుగా చేసుకోవాలని ఉందిరా అన్నాడు”.

” నాకు అలాగే ఉందిరా మీ అమ్మాయిని మా కోడలిగా స్వీకరించాలని ఉంది అన్నాడు” చతురాననం తండ్రి. ఉభయులు ఆనంద భరితులయ్యారు. సినిమా కథల్లో ఓ ముసలాడు చనిపోతూ తన మిత్రుని చేతిలో చేయి వేయించుకొని మా అమ్మాయిని నీ కోడలిగా చేసుకోవాలి రా అని ప్రమాణం చేయించుకుంటాడు. సినిమా కథ వేరు నిజజీవితం వేరు. పెద్దలు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. కాబోయే జీవిత భాగస్వాముల మధ్య అవగాహన కుదరాలి కదా!

చేతురాననాన్ని వివాహం చేసుకుందుకు ఇందిరా అంగీకారం తెలిపింది. చతురాననం మాత్రం ఇందిరని ఇల్లాలిగా చేసుకోవటానికి సమ్మతించలేదు. కారణం ఇందులోనే అంగవైకల్యం.

ఇందిరా తండ్రికి బారావహమైన గుండెతో గద్గదిక గొంతుతో అతి బాధాకరంగా చెప్పాడు. “సరే దానికి నువ్వేం చేస్తావులే ఎక్కడ రాసి ఉంటుందో అక్కడే అవుతుంది” అని సముదాఇస్తాడు ఇందిర తండ్రి. ఇక వధువుల వేట ప్రారంభించాడు చతురాననం. తనకు వధువు నచ్చితే వధువు తనని నచ్చలేదు. వధువుకు తాను నచ్చితే తనకు వధువు నచ్చలేదు. ఇలా 20, 30 సంబంధాలు చూశాడు. వధువుల ఎంపికలో రెండు వార్షికోత్సవాలు జరుపుకున్నాడు. ఈలోగా తండ్రి కాలం చేశాడు. ఇక గత్యంతరం లేక భూమి గుండ్రంగా ఉన్నట్టు మరోసారి రుజువు చేశాడు. ఇందిరనే వివాహం చేసుకుంటానని ఆమెకు అంగవైకల్యం ఉండటం వల్లనే ఆమె పట్ల ప్రగాఢ సానుభూతితో తనకు జీవిత భాగస్వామిగా స్వీకరించదలచానని ఒక మిత్రుని ద్వారా ఉత్తరం పంపాడు.ఇందిర నుంచి ప్రత్యుత్తరం వచ్చింది.

Photo by Daniel Moises Magulado from Pexels: https://www.pexels.com/photo/close-up-photo-of-person-holding-ring-1480284/

చతురాననం గారికి అభినందనలతో..

“రుక్మిణి దేవి ఆనాడు అగ్నిద్యోతనుడు అనే మధ్యవర్తిని కృష్ణుని దగ్గరకు రాయబారం పంపినట్టు, ఈనాడు మీరు మరో మధ్యవర్తి ద్వారా నా దగ్గరకు ఒక లేఖతో పాటు రాయబారం పంపారు. కృతజ్ఞత. వికలాంగుల్ని వికలాంగులు వివాహం చేసుకుంటే ఒకరికొకరు సహకరించుకునే అవకాశం ఉండదని… అందుచేత వికలాంగుల్ని వికలాంగులు కాని వారు వివాహం చేసుకోవడం కనీస ధర్మం అని మీ ఆదర్శాన్ని చాటి చెప్పినందుకు ధన్యవాదములు. అయితే ప్రయాగలోని త్రివేణి సంగమంలో ఈనాడు సరస్వతీ నది అంతర్లీనమై అంతర్వాహిని గానే ఉన్నట్టు మీ ఆదర్శంలో అంతర్లీనమైన కోరిక ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నాకు అంగవైకల్యం కొత్తగా రాలేదు జన్మతః ఉన్నది.

ఇంత క్రితం నన్ను మీ అర్ధాంగిగా స్వీకరించమని మా నాన్నగారు కోరినప్పుడు అంగవైకల్యం ఉన్న వాళ్ళని చేసుకుంటే మీ స్నేహితుల మధ్య చిన్నతనంగా ఉంటుందని… ఒకవేళ ఏ సినిమాకి వెళ్ళిన కుంటూకొంటుకుంటూ హాల్లో అడుగుపెడితే నలుగురిలోనూ అవమాన భారంతో కృంగిపోవలసి వస్తుందని మీరు భావించారు. ఆనాటి నేను వికలాంగురాలిని ఈనాడు కోమలాంగిని అయిపోయానా? అది మీ మనోవైకల్యం మాత్రమే ఈనాడు మళ్లీ నన్ను మీ అర్ధాంగిగా చేసుకోవటానికి మీరు సిద్ధపడ్డారు అంటే నా మీద మీకు జాలి అని భావించను వికలాంగుల కోటాలో ఉద్యోగం సంపాదించిన ఉద్యోగస్తురాలిని. మీరు తాగుడు, జూదము,వ్యభిచారంతోనూ జల్సాలు చేస్తే నా రెండువేల తోను కుటుంబ పోషణ చేసుకుంటూ మీకు వండిపడుండి సుఖాన్నిస్తూ పిల్లల్ని కనే యంత్రంలా నేను ఉండాలన్నది మీలో అంతర్లీనంగా ఉన్న ద్యేయం. కాబట్టి మీ ఆఫర్ ని తిరస్కరిస్తున్నాను!

“ఇట్లు ఇందిరా”

Leave a Reply