ఆదర్శ కుటుంబం

Indian Kids Photo by  samer daboul from Pexels: https://www.pexels.com/photo/photograph-of-happy-children-1815257/
Reading Time: 2 minutes

ఆదర్శ కుటుంబం

“గజం ఇలా రా..” అంటూ నాన్న పిలిచారు..చిరాకు పడుతూ “నాన్నా నేను ఎన్ని సార్లు చెప్పాను నన్ను గజం అని కొలతగా పిలవొద్దని.. “ ముద్దుగా అంటూ వచ్చింది గజలక్ష్మి.  గజలక్ష్మికి అప్పుడు తొమ్మిదేళ్లు. మన గజం మాట్లాడే ముద్దు మాటలంటే అందరికీ ఇష్టం. వాళ్ళది చాలా పెద్ద ఫామిలీ. మామలు, బాబాయిలు, బావలు, పెద్దనాన్నలు.. ఇంకా చాలా మంది అక్కలు ,చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. అందరిలో గజలక్ష్మి చిన్నది . చూడడానికి  సాధారణంగా ఉండేది. కానీ చాలా మంచి మనసు తనది. మొత్తం ఐదుగురు బావలతో ఆరుగురు అక్కలతో నలుగురు అన్నయ్యలతో ఇంకా చాలా మంది చుట్టాలు ఉండేవాళ్ళు వారి కుటుంబంలో. తన క్లాసులో అందరూ తన ఫ్రెండ్సే. గజలక్ష్మి అంటే ఇష్టపడని వారు ఎవరూ లేరు. అందరూ గజలక్ష్మి తన బావలలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు.

కాలేజీలో జాయిన్ అయింది గజలక్ష్మి. తను చదువుకున్న కాలేజీలో అబ్బాయిలతో కూడా చదువుకోవాల్సి వచ్చింది గజలక్ష్మికి. దాంతో అబ్బాయిలంటే మైత్రి కలిగింది గజలక్ష్మికి. తన క్లాస్ లోని ఒక అబ్బాయి కిషోర్. తనతో చాలాస్నేహం గా ఉండసాగాడు. అతనితో మాట్లాడడమన్నా, తన అభిప్రాయాలు పంచుకోవాలన్న గజలక్ష్మికి ఇష్టం కాసాగింది. కొన్నాళ్ళకి ఆ స్నేహం ప్రేమగా అనిపించసాగింది. కానీ ఇంట్లో చెప్పాలంటే చాలా భయం గజలక్ష్మికి. కిషోర్ కూడా తన తో సన్నిహితంగా ఉండే గజలక్ష్మి అంటే ఇష్టపడ్డాడు. నిజంగానే వారిద్దరి మధ్య చక్కటి ప్రేమ అనురాగాలు పెరగ సాగాయి. కిషోర్ వారింట్లో వాళ్లతో మాట్లాడాడు.  అదేవిధంగా గజలక్ష్మి ధైర్యం చేసి తన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పింది. ఇరు వైపుల వాళ్లు తమ పెళ్ళికి ఒప్పుకున్నారు. గజలక్ష్మి కిషోర్ లు దానికి ఎంతో ఆనందించారు. వారిద్దరి పెళ్లి ఆడంబరంగా జరిగింది.

ఎంతో సంతోషంగా ఉండాలని అనుకున్న గజలక్ష్మి కి పెళ్లయ్యాక కొద్దికొద్దిగా చిన్న చిన్న సమస్యలు మొదలవడం ప్రారంభించాయి. మొదట కుటుంబ వాతావరణం నచ్చకపోవటం. అత్తగారింట్లో గజం కు చాలా సార్లు చిన్న చిన్న విషయాల్లో అత్తగారు మామగార్లతో అభిప్రాయ బేధాలొచ్చేవి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఇంకా ఏదైనా కొనాలన్నా ఏ చిన్న అభిప్రాయం బేధం వచ్చ్చినా అది కేవలం ప్రేమ వివాహం మూలానే అనుకొని బాధ పడేది గజం.  ఇదే మా నాన్నగారైతే ఇలా అనేవారు, మా అమ్మ ఐతే ఇలా అనేది..అనుకుంటూ ప్రతీ చిన్న విషయానికీ తలుచుకుంటూ, పోల్చుకుంటూ బాధ పడేది. కానీ తన అభిప్రాయాలు కనపడనీయకుండా మనసులోనే దాచుకునేది.

Photo by Anoop VS from Pexels: https://www.pexels.com/photo/wedding-ceremony-of-a-couple-7669988/

కొన్ని రోజులు అలా గడిచాయి. ఇక తన బాధను భరించలేక ఒకనాడు కిశోర్ తో ఈ విషయం చెప్పగా అతను ఇలా అన్నాడు. “గజం నువ్వు నన్ను చూసినప్పుడు నువ్వు నేనొక్కడినే జీవితం అనుకున్నావు. కానీ మా కుటుంబంలో కూడా నన్ను పెంచిన తల్లిదండ్రులకు కూడా  ఆశలు  ఉంటాయి కదా. వాళ్ళు కూడా నా విషయంలో ఎన్నో ఆలోచించి ఉంటారు కదా. నువ్వు కేవలం నన్నే నీ దర్పణంలో చూస్తున్నావు కానీ నా చుట్టూ ఉన్నవారిని కూడా నీ దృక్పథంలో ఉంచాలి. అప్పుడే మనమంతా ఒక కుటుంబంలా సంతోషం గా ఉంటాం. అప్పుడే మన కుటుంబం ఆదర్శ కుటుంబమౌతుంది. ప్రతీ విషయాన్ని కేవలం నీ వైపు నుండే ఆలోచించక నీ అత్తగారు వాళ్ళు కూడా ఏ విధంగా అభిప్రాయపడుతున్నారో అర్ధం చేసుకుంటే నీవనుకుంటున్న సమస్యలు తొలగిపోతాయి.” అన్నాడు.

అప్పుడు గజంకు ఒక్కసారిగా తాను తన పుట్టినింటిలో ఉన్నప్పుడు తన దూరపుబంధువులు ఒకసారి కర్కశంగా తన తల్లిదండ్రులతో మాట్లాడితే తను బాధతో ఎలా విలవిలలాడిందో గుర్తుకు వచ్చింది. అది చాలా చిన్న విషయమే కావోచ్చుఁ. కానీ దానికి తను చాలా కలత పడిన మాట వాస్తవం. కిశోర్ అన్నట్లు వాళ్ళ  దృక్పథం కూడా తను తన పరిధిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను అనుకుంది. అలానే చేయడంతో తను తన బాధ నుండి విముక్తురాలైయింది.  తను అత్తగారింట్లో కూడా  చాలా సంతోషంగా ఉండగలిగింది. తను పెళ్లి కాక ముందు తన తల్లిగారింట్లో ఎలా అందరితో మంచిగా మాట్లాడేది, ఎంత సంతోషంగా అందరూ ఒక కుటుంబంలా ఉండేవారో అలానే తన అత్తగారింట్లో కూడా మెలగడం మరియు చిన్న విషయాలలో కూడా వారి ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మరియు వారి నిర్ణయాలకు కూడా స్థానం ఇవ్వడంతో, గజం అత్తగారింట్లో కూడా సుఖంగా ఉండగలిగింది. దానికి కిశోర్ తో సహా అందరూ సంతోషించారు.

Leave a Reply