సంగీతం పరిచయం

Indian Music Photo by ravi noel from Pexels: https://www.pexels.com/photo/a-woman-playing-a-musical-instrument-beside-a-man-14891905/
Reading Time: 2 minutes

సంగీతం పరిచయం

సంగీతము అనగా సమ్యక్ గీతం అని పెద్దలు చెప్పి ఉన్నారు. అనగా మంచి వినసొంపు గల గీతాన్ని సంగీతం అని అన్నారు. మరి కొందరు రాగశ్చ తాళశ్చ స్వరశ్చ త్రిభి సంగీత ముచ్యతే అని చెప్పారు. అనగా రాగ తాళ స్వరముల మూడింటి చేరికయే సంగీతమని, మరి కొందరు గీతం వాద్యం తథా నృత్యం వీటి కలయికను సంగీతమని చెప్పారు. సంగీతం భరతము నందు చెప్పబడియున్నది. భరతము అనగా భ అనగా భావం ర అనగా రాగం తమ్ అనగా తాళము అనగా భావ రాగ తాళముల చేరికయే భరతమని చెప్పబడియున్నది.  దీనిని భరతముని వలన ఇది వ్యాప్తిచెందినందువలన ఇది భరతమని ప్రసిద్ధి చెందినది.

భారత దేశములో అనేక రకముల సంగీతములు వ్యాప్తి చెందినవి. వాటిలో ఎక్కువగా వాడుకలో ఉన్నవి కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీతములు. కర్ణాటక సంగీతం ఎక్కువగా దక్షిణ భారతములోను మరియు హిందూస్థానీ సంగీతం ఉత్తర  భారతములో పేరుకెక్కినవి. ఈ రెండు సంగీతములలో కొన్ని రాగములు స్వరములు ఒకే విధంగా ఉండడము గమనిస్తాము. కొన్ని రాగముల పేర్లు ఒకే విధంగా మరియు కొన్ని రాగాలు ఒకే స్వరములైనను వేరువేరుగా పిలవబడుతున్నాయి. ఈ రెండు సంగీతాల మూలతత్వాలు ఒక్కటే అయినను వేర్వేరుగా ప్రదర్శింపబడుతున్నాయి. కర్నాటిక్ సంగీతంలో 72 మేళకర్త రాగాలు మరియు హిందూస్థానీ రాగాలు 10 మేళకర్తలు గా పేరుగాంచినవి . ఈ రెండు సంగీతములలో తాళపద్ధతులు చాలా వరకు వేర్వేరుగా  ఉన్నవి.

ఈ రెంటిలోనూ స్వరములలో శుధ్ద మరియు అన్య స్వరములు కలిగి ఉన్నాయి. మొత్తముగా 12 స్వరములు ఉన్నాయని ఈ రెంటిలోనూ గమనిస్తాము. ఈ రెంటిలోనూ జనక రాగములు నుండి జన్య రాగములు ఉద్భవిస్తాయని అంగీకరిస్తాయి. కానీ వాటి స్వరస్థానాలలో బేధం ఉన్నది. కొన్ని రాగాలు  ఒకే విధంగా ఉన్నాయి. ఉదాహరణకు కర్నాటిక్ రాగం  “మేచ కళ్యాణి” హిందుస్తానీలో  ” కళ్యాణి” రాగం , కర్నాటిక్ లోని “ధీర శంకరాభరణం” రాగం హిందుస్తానీలో ” బిలావల్” గా , కర్నాటిక్ లోని  “మోహనం” హిందుస్తానీలోని “భూపాలీ” రాగంగా పిలబడుతున్నది.

హిందుస్తానీలో ముఖ్యంగా రాగాలు మూడు  జాతులలో సంపూర్ణ, ఔఢవ  మరియు షాఢావం విభజింపబడ్డాయి. కర్నాటిక్ సంగీతంలో రాగాలను 5 జాతులలో పరిగణింపబడతాయి. అవి సంపూర్ణ, ఔఢవ, షాఢావ, మిశ్ర మరియు సంకీర్ణ. కర్నాటిక్ రాగ పద్ధతులు గమకయుక్తముగా ఉంటాయి. విభిన్న వాయిద్యాలు కర్నాటిక్ మరియు హిందూస్థానీ  సంగీతములలో ప్రదర్శింపబడ్డాయి.  కొన్ని ప్రసిద్ధ కర్నాటిక్ వాయిద్యాలు మృదంగం, వీణ మరియు వయోలిన్. కొన్ని హిందూస్థానీ వాయిద్యాలు సితార్, తబలా, వయోలిన్  మరియు  ఫ్లూట్ తదితరులుగా చెప్పబడ్డాయి.

సంగీతం, పెద్దలు చెప్పినట్లుగా “శిషుర్ వేత్తి పశుర్ వేత్తి , వేత్తి  గాన రసం ఫణిహి”అంటే సంగీతం చిన్నపిల్లలతో బాటు పశువులను విషసర్పములను కూడా రంజింపచేస్తాయి అని చెప్పి ఉన్నారు   సంగీతం మనసులను ఆనందింపచేయడమే కాకుండా సంగీతం వలన చాలా రోగాలనుకూడా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. కనుక ఇటువంటి సంగీతం మరింత కొనసాగాలని కోరుకుందాం.

Leave a Reply