ఆదర్శ పురుషుడు రాముడు

Lord Ram @pexels.com
Reading Time: < 1 minute

ఆదర్శ పురుషుడు రాముడు

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .

మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన  – ఆదర్శ పురుషుడు

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన –  అద్దం – రాముడు .

ధర్మం పోత పోస్తే రాముడు
ఆదర్శాలు రూపుకడితే రాముడు .
అందం పోగుపోస్తే రాముడు 
ఆనందం నడిస్తే రాముడు

వేదోపనిషత్తులకు అర్థం రాముడు
మంత్రమూర్తి రాముడు .
పరబ్రహ్మం రాముడు .
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు

ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట – శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట –
రామాలాలీ – మేఘశ్యామా లాలీ

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష – సర్వజగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట – అయ్యో రామా

వినకూడని మాట వింటే అనాల్సిన మాట – రామ రామ

భరించలేని కష్టానికి పర్యాయపదం – రాముడి కష్టం .

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే – రాముడు

కష్టం గట్టెక్కే తారక మంత్రం – శ్రీరామ .

విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట – శ్రీరామ శ్రీరామ శ్రీరామ .

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట – అన్నమో రామచంద్రా

వయసుడిగిన వేళ అనాల్సిన మాట – కృష్ణా రామా !

తిరుగులేని మాటకు – రామబాణం 

సకల సుఖశాంతులకు – రామరాజ్యం .

ఆదర్శమయిన పాలనకు – రాముడి పాలన

ఆజానుబాహుడి పోలికకు – రాముడు

అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 

రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా – Rama killed Ravana ; Ravana was Killed by Rama .

ఆదర్శ దాంపత్యానికి సీతారాములు

గొప్ప కొడుకు – రాముడు

అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు

గొప్ప విద్యార్ధి రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

మంచి మిత్రుడు- రాముడు (గుహుడు చెప్పాడు).

మంచి స్వామి రాముడు (హనుమ చెప్పారు).

సంగీత సారం రాముడు (రామదాసు , త్యాగయ్య చెప్పారు)

నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం (పిబరే రామరసం) – సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం – రాముడు
నోరున్నందుకు పలకాల్సిన నామం – రాముడు
చెవులున్నందుకు వినాల్సిన కథ – రాముడు
చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు – రాముడు
జన్మ తరించడానికి – రాముడు , రాముడు, రాముడు .

Leave a Reply