భోజన నియమాలు

Food @pexels.com
Reading Time: 2 minutes

భోజన నియమాలు


1. భోజనానికి ముందు,తరువాత తప్పక  కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.  తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.


2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)  తినే పళ్ళానికి తాకించరాదు.   అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి.  ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.  చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.  ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు  ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు.  (ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.  అతిథులకు పెట్టరాదు.

15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.  (వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే  మనం తినగా మిగిలినవి పెట్టరాదు.  మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 

18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. 

20. భగవన్నామము తలుచుకుంటూ లేదా  భగవత్ కథలు వింటూ  వంట వండడం,  భోజనం చేయడం చాలా ఉత్తమం. 

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని  ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు) 

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .  ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు  (తిన్న విస్తరిని మడవడం అనాచారం).    తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. (జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    

28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.  అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. 
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  

30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని  కఠోర నియమము.   పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు, పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.  అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.  ద్విపాక దోషం వస్తుంది. 

Leave a Reply