తులసి మొక్క – Holy Basil Plant

Basil @pexels
Reading Time: 2 minutes

తులసి మొక్కను ఆధ్యాత్మికంగా హిందూ సంప్రదాయంలో పూజిస్తారు. ముఖ్యంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పూజిస్తారు. ఈ మొక్క యొక్క ఎండిన కాండాన్ని మాలగా తయారు చేసి జపం చేయడానికి ఉపయోగిస్తారు.

తులసి దేవతగా పూజింపబడే మొక్క. తులసిలో ముఖ్యంగా రెండు రకాలైన మొక్కలు ప్రాచుర్యంలో ఉన్నాయి. విష్ణు తులసి మరియు కృష్ణ తులసి. విష్ణు తులసి మొక్క ఆకులు పచ్చ రంగులో ఉంటాయి. కృష్ణ తులసి మొక్క ఆకులు ముదురు వర్ణంలోను ఉంటాయి.

తులసి మొక్కను ఇంటి ప్రాంగణంలో పెంచుకుంటారు. తులసి మొక్కను ఒక కుండీలో కాకుండా ముఖ్యంగా నాలుగు వైపులా దీపపు ప్రమిదలు పెట్టి పూజించటానికి వీలుగా తయారు చేస్తారు. హిందూ సాంప్రదాయంలో భాగంగా తులసి మొక్క చుట్టూ ప్రదక్షణలు చేస్తూ పూజ చేస్తారు.
ఇందువల్ల తులసి మొక్క నుంచి వచ్చే ప్రాణవాయువు పీల్చటం వల్ల ఆరోగ్యానికి  అన్నీ రకాలుగా మంచిది అని వైద్య శాస్త్రం చెబుతుంది.

ఆ తులసి మొక్క ఆకులను దళాలుగా తుంచి పూజకు వినియోగిస్తారు. కార్తీక శుక్లపక్ష ఏకాదశినాటి నుండి పౌర్ణమి వరకు తులసీ కళ్యాణం జరుగుతుంది. తులసిని ఉదయం నిద్రలేవగానే దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని ప్రజల నమ్మిక.

గుబురుగా పెరిగిన తులసీ వనంలో ఏకాగ్రతతో, నిష్టతో పూజలు చేస్తారు. అటువంటి ప్రదేశం వారణాసిలో తులసీ మానస్ నే మందిరంలో ఇతర హిందూ దేవతలతో పాటు తులసి కూడా పూజలు అందుకుంటుంది.

తులసి విష్ణువుకు ప్రియ భక్తురాలు. విష్ణుపూజలో తులసిని విరివిగా వాడతారు. తులసి దళాలను మాలగా కట్టి విష్ణువుకు అలంకరిస్తారు.

శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకసారి సత్యభామ కారణంగా తులాభారానికి గురికావడం జరిగింది. అప్పుడు తన యావదాస్తిని పెట్టి తూకం పెట్టి తిరిగి పొందలేకపోయింది సత్యభామ. తరువాత రుక్మిణీదేవి సహాయంతో ఒక తులసీ దళం వల్ల తిరిగి పొందగలిగింది అని పురాణాలు చెపుతున్నాయి.

తులసి సర్వరోగనివారిణి అంటారు. అంటే ఈ తులసి మొక్క ఔషధ పరంగానూ ఉపయోగ పడుతుంది. తులసి కషాయం సేవించడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి. తులసి ఆకులను రోజు గుప్పెడు చొప్పున సేవించడం వల్ల జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
తీవ్ర జ్వరం, వాంతులు, ఆస్తమా, డయేరియా, మధుమేహం, ప్లూ వంటి సమస్యలు తగ్గుతాయి.

రక్తంలో కొవ్వు తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి తులసి ఆకులు చాలా ఉపయోగపడతాయి.

తులసి ఆకుల రసానికి, పాలు, తేనె కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

తులసి ఆకులను మజ్జిగలో వేసి తాగడం వల్ల బరువు తగ్గుతారు. తులసి ఆకులను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

తులసి రసానికి తేనె కలిపి తీసుకోవడం వల్ల పైత్య సమస్యలు తగ్గుతాయి.

ప్రతిరోజూ రెండుసార్లు పన్నెండు తులసి ఆకులను తినడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. ఒత్తిడి తగ్గి మనసు ఉత్తేజితం అవుతుంది.

తులసిని తీసుకోవడం వల్ల రోగనరోధకశక్తి పెరుగుతుంది.
తులసి మొక్క ఆకులను ఆయుర్వేద వైద్యంలో కషాయంగానూ, ఎండిన తులసి ఆకుల పొడిని మాత్రలు తయారు చేయడంలో తయారుచేస్తారు.

తులసి మొక్కను పాశ్చాత్య దేశాల్లో కూడా విరివిగా ఉపయోగిస్తారు. విదేశాల్లో కూడా ఈ మొక్క ప్రాముఖ్యతను నమ్మి వైద్యంలో వాడుతున్నారు

Leave a Reply