సప్తగిరి సర్కిల్ లో మిరపకాయ బజ్జీల బండి

Reading Time: < 1 minute

“ఏందమే! రాజమ్మా, ఏడుండాడి మతి? యింకా ఎర్రగడ్డలు, కొత్తిమిర తరగలేదేందమే ? నాలుగు దాటింది గందా? బండి పెట్టేటిడి ఎప్పుడంటా??” దాదాపు గా అరుస్తున్నట్టే అడిగాడు సుబ్బారాయుడు. చెనిగిపిండి మర పట్టించనీకి పోయాడు తను ,అక్కడ మర కాడ ఎంత రద్దీగా ఉంది అనుకుంటే , ఇక్కడ ఇంటికొచ్చి చూసాడుగందా ,అన్నీ ఎక్కడివక్కడే ఉండాయి.

తానే సర్దుకోవటం మొదలు పెట్టాడు, అప్పుడు గబగబా లేచి రాజమ్మ కూడా అందుకోవటం మొదలు పెట్టింది. అర్డగంటలో అన్నీ సర్దేసి, ఇద్దరూ బండి తోసుకుంటూ బయల్దేరారు.సప్తగిరి సర్కిల్ లో రోజూ మిరపకాయ బజ్జీల బండి పెడతారు. ఐదింటికల్లా మొదటి వాయ రెడీ గా ఉంటుంది. పాతికేళ్ళగా ఎండ ని,వాన ని లేకుండా ఏ రోజూ బండి పెడతారు. రాజమ్మ ఈ మధ్య ఉషారుగా ఉంట్లేదు . అలా అని ఆరోగ్యం బాగోక కాదు.

నెమ్మదిగా ఒక్కొక్కళ్లూ బజ్జీల కోసం వస్తున్నారు . అందులో రోజూ వచ్చే వాళ్లే ఎక్కువ. “ఏంది సుబ్బారాయుడూ! “కొడుక్కి బ్యాంకు లో కొలువంట గందా! యింకా ఈ చాకిరీలేందీ? కమ్మగా ఇంటికాడ కూచోక ?” చనువుగా అన్నాడు రోజూ తినే శీనయ్య. బజ్జీలు పొట్లం కట్టేదల్లా వీళ్ల మాటలు వింటూ చిన్నగా నిట్టూర్చింది రాజమ్మ. “ఏందన్నా! అట్లా అడిగినవ్, కొడుక్కి మంచి కొలువొస్తే నాయన చెసేటి పని ఎందుకు మానెయ్యాలి? ఆడింతదాకా ఒచ్చీడంటే జరుగుబాటంతా ఈ బండి మీదనే గందా! నేను ఓపికున్నంతకాలం ఈ బండినైతే వదిలేది లేదు ” నవ్వుతూనే తన మనసులో మాట చెప్పాడు సుబ్బారాయుడు .అదే కదా రాజమ్మ మనేద, కొడుకు తనకి చిన్నతనంగా ఉంటుందని చూచాయ గా చెప్పాడు. భర్త ని మానేద్దామని అడిగి చూసింది. కానీ సుబ్బారాయుడు ఒప్పుకోలేదు. కొడుకు ఎత్తు ఎదిగాడని ఇప్పుడు దాక వాడెక్కిన మెట్లు నరుక్కోవాలా? మన స్థోమత కి మించిన వాడి అవసరాలని తీర్చింది ఈ ఆసరానే . మనకి ఒపికున్నంత కాలం లాగుదాం, తరువాత సంగతి తరువాత, బండి మాత్రం ససేమిరా తీసేది లేదని భార్య కి చెప్పేసాడు.

ఇప్పుడు కొడుక్కి ఏంచెప్పాలో అని ఆలోచిస్తాంది రాజమ్మ. భర్త చెప్పింది సబబే గందా! చెట్టు ఆకాశం దాకా ఎదిగాక మట్టిని చీదరించుకుంటే ఎట్టా? ఇదే మాట చెబ్దామని నిర్ణయించుకుంది. ఇప్పుడు రాజమ్మ మనసు చాలా తేలికపడింది, మళ్ళీ ఉషారుగా తన పని తాను చేకుపోతాంది.

Leave a Reply