దొంగలు పడ్డారు

Reading Time: < 1 minute

ఒక కవి ఇంట్లో
దొంగలు పడ్డారు..!
ఆరు వారాల నగలు
మూడు లక్షల నగదు
ఐదు పుస్తకాలు పోయాయి..!

పుస్తకాలది ఏముందయ్యా…నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.

పోలీసుల దర్యాప్తు జరుగుతోంది..నెలలు గడుస్తున్నా జాడలేదు…ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి….

ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది.. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో…కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు…

పుస్తకాలు పోతేపోయినయి.. సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు..

ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి…
” పోద్దురు బడాయి “

” పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే…అవి నా పంచప్రాణాలు… పంపించినవాడు పుస్తకాలు పంపించి…నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని…కష్టపడితే సొమ్ము సంపాదించగలను..మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే…అవి సరస్వతీ దేవి అమ్మవారు “… ఏడవడం మొదలెట్టాడు.

” నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే.. నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి.. ఆ దొంగేవడో పిచ్చోడు ” ఆనంద పడింది.ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది.దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.

కవి గారికి
నమస్కారములు…
బీరువా తాళాలు పగులగొట్టి చూశా…నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా…బీరువాలో ఎందుకు దాచారు…వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా…నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది…అది జ్ఞాన నిధి…తప్పుచేశానని తెలుసుకున్నా…
ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది…చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా…డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా…ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా….వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా…ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు…ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి…ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా…పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా…
ఇట్లు
దొంగతనాలు మానిన దొంగ

ఇప్పుడు కవి ముఖంలో ఆనందం..
ఆయన భార్య ముఖంలో ఆలోచనలు
లక్ష్మీదేవి గొప్పదా..?
సరస్వతీ దేవి గొప్పదా..?

Leave a Reply