పదిమందికి నేర్పించు

Good People @pexels
Reading Time: 3 minutes

ఒక మనిషి ఉన్నతస్థాయి కి రావటానికి గొప్ప గొప్ప సంస్థ ల లో చదవాల్సిన పనిలేదు,మేధావుల ప్రేరణా ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు .మన చుట్టూ ఉన్న పరిస్థితులు,మనకు ఎదురయ్యే సందర్భాలు మనకి మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని,మానసిక ధృడత్వం ను కలిగించటం మనం చాలామంది కార్యసాధకుల జీవితాలని గమనిస్తే అర్డమవుతుంది.అలాంటి ఒక చిన్న జీవితాన్ని ఇప్పుడు చూద్దాం.

చీకటి పడుతూ ఉంది.అసలే మబ్బులు పట్టి ఊన్నాయేమో ఐదు కూడా అవ్వకుండానే సూరీడు మొహం చాటేశాడు.గాలి విసురు ఎక్కువవటం మొదలయ్యింది.దూరంగా ఎర్రటి దుమ్ము గాల్లోకి లేస్తూ,వర్షానికి ఆహ్వానం పలుకుతోంది.ఆ దుమ్ము లోంచే ఎగురుతూ, గంతులేస్తూ ఎంతో హుషారుగా వస్తున్నాడు శివుడు.వాడి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది.వాన మొదలయ్యేలోపు గుడిసెకు చెరుకుందామనే ఆలోచన ఏమాత్రం లేనట్టుంది.ఈ ప్రపంచమంతా ఏమవుతుందో పట్టించుకునే స్థితి లో వాడు లేడు.

సుడిగాలి తో పోటీ కైనా సిద్ధం అన్నంత వెర్రి ఆనందం లో ఉన్నా, వాడి ఎడమ చేయి మాత్రం చొక్కా జేబు దగ్గర గట్టిగా పట్టుకునే ఉంది.అదే వాడి సంతోషానికి కారణం.వాడి మనసు వాడిని నేల మీద నడవనీయటం లేదు.నిజంగా సత్యం మాస్టారు గారు స్కూల్ కి రావడం తన అదృష్టమే కదా,టీ కొట్లో పనిచేస్తున్న తనని అమ్మా, నాయన లని ఒప్పించి,బడికి తీసుకురావటం కాకుండా ఈ లోకం లో ఎట్లా బ్రతకాలో అందరికీ ఆయన ఒకే విధంగా చెప్తున్నారు కానీ శివుడికి మాత్రం ఎంతో గొప్పగా అనిపిస్తున్నాయి.

ఆయన చెప్తూంటే ఇంకా ఇంకా వినాలనీ,బాగా చదువుకోవాలని,ఆయన లాగే చాలా మందికి ఈ విషాయాలన్నీ చెప్పాలనిపిస్తోంది అంటే మా వెంకటేసు,బ్రహ్మన్న,కోటేసు లు నన్ను వెర్రి వెంగళప్ప లా చూస్తున్నారు.అయినా వాళ్ల తో నాకేంటి??వాళ్ళ కు చేతకానిది నాకు వచ్చిందని వాళ్లకి కుళ్లు అని నాకు తెలుసు.అదంతా సత్యం మాష్టారి దయే.ఆయనకి ఎన్నో విషయాలు తెలుసు.ప్రతి సంవత్సరం వినాయక చవితి కి రకరకాల రంగు రంగుల గణపయ్య ల ను పూజలో పెట్టుకుంటారు కదా! కానీ,మట్టి తో చేసిన వాటిని పెడితేనె మన వాతావరణం పాడవకుండా వుంటుంది అని చెప్పారు. చెప్పటమే కాదు గణపయ్య ల ను తయారు చెయ్యడం కూడా నేర్పించారు.

రోజూ బడి నుండి రాగానే అమ్మ చెప్పిన పనులు చేసేసి ,చెరువు దగ్గరికి వెళ్లి మట్టిని తెచ్చి,ఎంతో కష్టపడి ఇరవై నాలుగు ప్రతిమలు చేసి, ఒక్కోటి పది రూపాయలు చొప్పున అమ్మాడు.ఆ రెండువందల నలభై రూపాయలే వాడిని ఈ భూమి మీద నిలబడనీయడం లేదు.పండక్కి కొత్త లాగూ చొక్కా కొనుక్కోవాలి,స్నేహితులతో ఆడిపాడాలి.అవునూ.. నేను మాత్రమే కొత్త బట్టలు కొంటే ఎట్లా??అమ్మ కి కూడా చీర కొనియ్యాలి,అమ్మ ఎప్పుడూ మాసిపోయిన చీర లో నే ఉంటుంది.

ఇప్పుడు మంచి రంగులున్న చీర కొనివ్వాలి.శివుడు ఆలోచన నుండి తేలకుండానే వర్షం ముంచెత్తింది. అప్పుడు వచ్చిపడ్డాడు,ఈ లోకం లోకి.దూరంగా కనిపిస్తున్న గుడిసె లో కి నాలుగంగల్లో దూకేసాడు,డబ్బు తడిచిపోతుందన్న భయం తో కానీ ఇంట్లో పరిస్థితి చూసి వాడి సంతోషం అంతా గాల్లోకి కొట్టుకుపోయింది.ఇల్లంత చీకటిగా ఉంది,దీపం కూడా వెలిగించి లేదు,సన్నగా ఏడుపు వినిపిస్తుంది.ఇదేమీ కొత్త కాదు వాడికి,దాదాపు రోజూ ఉండేదే.కూలి డబ్బులతో పీకల్డాకా తాగి వచ్చే అయ్య చెసే రాద్ధాంతం ఇదంతా.

తన కష్టమంతా తాగి తందనాలు ఆడటమే కాకుండా అమ్మ కూలి డబ్బులు కూడా లాక్కెళ్ళటం,ఇవ్వకపోతే గొడ్డు ను బాదినట్టు బాదటం,ఇంట్లో ఉన్నట్టయితే శివుడికి కూడా దెబ్బల్లో వాటా ఉండేది.కానీ ఈరోజు వాడు బ్రతికిపోయాడు.దీపం వెలిగించి, గాలికి ఆరిపోకుండా ఒక మూలన పెట్టి నెమ్మదిగా అమ్మ దగ్గరికి వెళ్లాడు.తాడు తో కొట్టినట్టు ఉన్నాడు,ఒళ్లంతా వాతలు తేలి ఉన్నాయి.వాడి కి కూడా ఏడుపచ్చేసింది,ఇప్పుడే వస్తానమ్మా అంటూ తల్లి పిలుస్తున్నా వినకుండా నీళ్లు తాగే గ్లాసు పుచ్చుకొని యూరియా సంచి నెత్తినేసుకుని బయటికి పరుగు తీసాడు.ఇంటికి వచ్చే సరికి మూలుగుతూ పడుంది .నెమ్మదిగా అమ్మ ని లేపి ఒళ్లు నెప్పులకి తీసుకొచ్చిన మాత్ర ఇచ్చి,వేసుకున్న తరువాత వేడి గా గ్లాసు నిండా తెచ్చిన టీ తాగిస్తుండగా, తూలుకుంటూ గుమ్మం తన్నుకుంటూ వచ్చి పడ్డాడు రాజులు.ఏం చేస్తున్నారే..??

తల్లీ కొడుకులిద్దరూ కలిసి నన్నెట్టా చంపాలో నని ఆలోచనలు చేస్తున్నారా??నువ్వు ఈపూట నీ కూలి డబ్బులు ఈయక పొతే మీ ఇద్దరికీ ఇదే ఆఖరి రోజు అవుతది అంటూ నిలబడి ఉన్నాడో ,పడిపోతున్నాడో తనకే తెలియటం లేదు కానీ,మాటలు మాత్రం అర్థం అయ్యే లాగానే చెప్తున్నాడు.ఊగిపోతూ వచ్చి శివుడి జుట్టు గట్టిగా పట్టుకొని ఈడ్చాడు.అనుకోకుండా జరిగేసరికి వాడి తల గుంజ కి కొట్టుకుంది.కెవ్వుమని కేక పెట్టాడు.అమ్మ ప్రాణం గిలగిల లాడింది.ఆమె ఆపేలోపే ఈడ్చిపెట్టి వాడి డొక్కలో తన్నాడు.తన దగ్గర డబ్బులు లేవని,వాడిని కొట్టి చంపెయ్యొద్దని కాళ్లు పట్టుకొని బతిమాలినా వాడి కసాయి గుండె కరగలేదు.ఇంకోసారి వాడిని ఈడ్చబోతుంటే జేబులో నుంచి చిల్లర పడేసరికి వాడి జేబులు వెతికి,డబ్బులు లాక్కొని మరో రెండు తన్నులు బహుమతి గా ఇచ్చి,మళ్లీ బయటికి పోయాడు.

శివుడికి ఒళ్లంతా పచ్చి పుండులా ఉంది.పైకి కూడా లేవలేక పోతున్నాడు.అమ్మ ఒళ్ళో తల పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.ఎంత ఆశ పడ్డాడు..!పండక్కి కొత్త బట్టలు,అమ్మకి చీర ఎట్లా కొనేది ?? నిద్ర లో వచ్చిన మంచి మంచి కలలన్నీ కళ్లు తెరిచాక అబద్దం లాగే అనిపిస్తాయి.కానీ తన కలల కోసం ఎంతో కస్టపడినా శ్రమ వృధా నే అయ్యింది.ఎంతసేపటికి ఏడుపు ఆగటం లేదు,ఇది కలే అయితే బాగుండు అనుకుంటూనే అమ్మ వంక చూసాడు.అమ్మ కళ్లు జలపాతాల్లాగే ఉన్నాయి.అప్పుడు ఆమె రెండు మాటలే చెప్పింది కానీ ఆ రోజు వాడి జీవిత గమనాన్నే మార్చింది.

“నాన్నా! నొప్పిగా ఉందా?? నాకు పడే దెబ్బల్ని కూడా నువ్వు పంచుకుంటున్నావారా..?? ఈరోజు నువ్వు సంపాదించిన డబ్బునైతే మీ నాన్న లాక్కెళ్ళగలిగాడు కానీ నీ దగ్గర ఉన్న కళ ని,నీ చదువుని మాత్రం ఏంచేయలేడు.అందుకే నువ్వు ఎవరూ నీ దగ్గర నుంచి వేరు చేయలేని దానికోసం ఎంతైనా కష్టపడు.పదిమందికి ఆ కష్టపడటమెలాగో నేర్పించు. “

అంతే,శివుడికి ఇంకెప్పుడూ ఏడుపు రాలేదు.

Leave a Reply