అక్షయ తృతీయ

Reading Time: 4 minutes

సంస్కృతంలో “అక్షయం” అంటే నాశనం లేనిది లేదా అనంతమైనది అని అర్ధం.

Akshaya Tritiya - Gold
Akshaya Tritiya – Pexels.com

ఈ అక్షయ తృతీయ సర్వసిద్ది ముహూర్తం. అంటే ఎంత పవిత్రమైన, మహిమాన్వితమైన దినమో కదా!

ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం సిద్దిస్తుంది.

ఇది దాన ధర్మాలు చేసి, పుణ్యం సంపాదించుకునే రోజు. బంగారం కోసం ఖర్చు పెట్టే రోజు కాదు; ఈ అక్షయ తృతీయ రోజున మనం  ప్రారంభించే మంచి పని యొక్క పుణ్యం ఎప్పటికీ “క్షయం” కాకుండా అనంతకాలం “అక్షయం”గా ఉండిపోతుంది.

ఈ అక్షయ తృతీయ రోజున పాపం, ఎన్ని జాతక రెమిడీ లు చేసినా పోదు. పాప కర్మ ఫలితం ఎప్పటికీ ఉండిపోతుంది (అక్షయం అవుతుంది). మనసా వాచా కర్మణా ఎవరికీ ఇబ్బంది కలగకుండా మనం  ప్రవర్తించాలి.

రోగులకు సేవ, పేదలకు అన్నదానం, దైవ పూజ – వ్రతం, మంత్ర సాధన… ఈ కరోనా కాలంలో   – ఇంట్లో పనులు చేసుకుంటూనే – భగవద్గీత పారాయణం చదువుతూనో ఆడియో వింటూనో చేయండి. మధ్యాహ్నం తినేముందు రెండు ముద్దలు పితృదేవతల కు పెట్టండి! కాకి కి పెడితే – మీ పితరులకు, యమునికి, శని దేవునికి, కాలభైరవునికి పెట్టినట్టే.

ఈ పుణ్యకార్యాల వలన మీ భవిష్యత్తు బంగారంగా మారుతుంది. కేవలం బంగారం కొనడం ద్వారా కాదు. బంగారం కొంటే లక్ష్మీదేవిని కొనేయడమే అనే భ్రమ నుంచి బయట పడండి!

: అక్షయ తృతీయ పూజ విధానం ::

ఇంట్లో ఈశాన్యం మూలలో పసుపుతో అలికిన పీటను వేసి ఎర్రటి వస్త్రాన్ని పరిచి, 
లక్ష్మీ, నారాయణుల విగ్రహాలను / పాపములను అమర్చాలి. లక్ష్మీ దేవి విగ్రహం నారాయణుని ఎడమ పక్క ఉండేట్లు అమర్చాలి.

కొందరు లక్ష్మీ, కుబేరులను కూడా పూజిస్తారు. ఈ సందర్భంలో కుబేరునకు కుడి ప్రక్కన లక్ష్మీ దేవిని పెట్టి పూజించాలి. కుబేరుడు సర్వదేవతలకు కోశాధికారిగా కీర్తింపబడ్డారు.

వెండి దీపాలు లేదా ఇతర లోహపు దీపాలు లేదా ప్రమిదలలో ఒత్తులువేసి, ఆవు నేతితో కానీ, నూనెతో కానీ దీపాలను వెలిగించాలి.

అగరబత్తిలను వెలిగించాలి.
పూజ సమయంలో పసుపు, కుంకుమ, అక్షతలను భగవంతునికి సమర్పించాలి.

పూజకు ముందు కొబ్బరి కాయ, పండ్లు, ఆకు చెక్కలను పీటపై నైవేద్యంగా ఉంచాలి.

లక్ష్మీ, నారాయణులను మీ శక్తి మేరకు “అష్టోత్తరాలను* లేదా సహస్రం చదివి, గృహానికి ఆహ్వానించి, నైవేద్యాన్ని స్వీకరించమని ప్రార్ధించాలి.

నైవేద్యాన్ని సమర్పించిన పిమ్మట లక్ష్మీనారాయనుల ఆశ్శీస్సులు కోరుకోవాలి.

చివరిగా గంట కొట్టి హారాతినివ్వాలి.

:: అక్షయం అంటే? ::

అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం “అక్షయ తృతీయ” నాడు చాలా మంది బంగారం, భూములు, అపార్ట్మెంట్లు కొనుగోలు విరివిగా చేస్తుంటారు. 

అయితే పండితులు మాత్రం ఇలా ఐశ్వర్యాన్ని  పొందగోరి అప్పుల పాలు కావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఐశ్వర్యాన్ని అందుబాటులో ఉన్న నిధులతోనే కొనుగోలు చెయ్యాలని అప్పులతో కాదని గ్రహించాలి.

:: అక్షయ తృతీయ విశిష్టతలు ::

మన పురాణాలు, పండితులు చెబుతున్న అక్షయ తృతీయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి.

వాటి వివరాలు …
ఈ రోజే మహా విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని జననం.

ఈ పవిత్ర దినానే త్రేతాయుగం ప్రారంభమైనదని పండితుల మాట.

గంగమ్మ భువి పై ఉద్భవించిన రోజు ఈ రోజే.

అక్షయ తృతీయ నాడే వ్యాస మహర్షి “మహాభరతం” పవిత్ర గ్రంధాన్ని రచన ప్రారంబించిన రోజు.

ఈ రోజే అమ్మ “అన్నపూర్ణ దేవి” అవతరించిన రోజు.

అక్షయ తృతీయ పవిత్ర దినాన్నే కుబేరుడు శివానుగ్రహాన్ని పొంది మహలక్ష్మి ద్వారా అనంత సంపదను పొంది సంరక్షకుడిగా నియమింపబడ్డాడు.
శ్రీకృష్ణుడు ద్రౌదపదిని దుస్సాసన  నుండి కాపాడిన దినం.

శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగించి  అపార సంపదను అనుగ్రహించిన రోజు.

సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో పాండవులకు “అక్షయపాత్ర”ను ఇచ్చినరోజు.

ఆదిశంకరుల వారు ఓ పేద వృద్ద జంట లబ్ది కోసం సృష్టిలో తొలిసారి “కనకధారాస్థవం” స్తుతించిన రోజు.

ఈ పవిత్ర దినానే, దివ్య క్షేత్రం “బద్రీనాథ్” ఆలయ ద్వారాలు 4 నెలల దర్శన విరామం తర్వాత, పునః దర్శనార్ధమై తెరుచుకోబడతాయి.

ఏ ఏటి కాఏడు ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంబించే రోజు.

ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు.

బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.

: అక్షయ తృతీయ నాడు చేసే పూజ ఫలితాలు ::

అక్షయ తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించడం చేస్తే అనేక రెట్లు వృద్ది చెందుతుందని విశ్వాసం.

ఈరోజు దానాలను చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశించి దానగుణ సంపన్నుడుగా కీర్తి గడించగలరు.

ఈరోజు శంఖం ఇంటికి తెస్తే ఎంతో మంచిదట. ప్రతి పూజ ముగిసిన తరువాత శంఖం పూరించాలట.

ఈరోజు పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే మంచి జరుగుతుందట. రోజూ పూజిస్తే మంచి ఫలితాలు దక్కుతాయట.

ఈరోజు గవ్వలను ఇంటికి తెచ్చి పూజిస్తే విశేష ఫలితాలు దక్కుతాయట. గవ్వలకు లక్ష్మీదేవి దృష్టి ఆకర్షించగలిగే శక్తి ఉందట. వీటిని పసుపు, కుంకుమలతో పూజించాలట.

ఉపవాస దీక్షను ఆచరించి లక్ష్మీనారయనులను పూజిస్తే మంచిదని పెద్దల మాట.

అక్షయ తృతీయ నాడు జన్మించిన పరశురాముని పూజించటం మేలు చేస్తుందని పండితుల మాట.
ఈరోజు చందనం దానం చేయడం ద్వారా గృహాల్లో జరిగే ప్రమాదాల నుండి రక్షింపబడతారాట.
చదువులో పిల్లలు విజయం సాధించటం కొరకై ఈరోజు మజ్జిగ దానం చేస్తే మంచి జరుగుతుందట.

ఈరోజు నూతన వస్త్రాలను లేదా పాతవస్త్రాలను బీదలకు దానం చేయటం ద్వారా మీకు మరియు మీ కుటుంబ సభ్యలకు ఆయురారోగ్యాలు చేకూరతాయట.

ఈరోజు జంతువులకు ఆహారం వేయటం ద్వారా వాటి ప్రేమను యజమానికి రెట్టింపు చూపిస్తాయట.

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. 

ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని (ఎప్పటికీ ఉండిపోతుందని) చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది.

అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే — కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి – చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయి (ఎప్పటికీ ఉండిపోతాయి)

పురాణకథనం
మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. 

అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. 

అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.

శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది. 

ఈ నాడు దానం, ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారదమహర్షి ఇలా చెప్పాడు. 

అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృత, ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు, సహస్రాదిత్య సంకాశుడై, సర్వకామ సమన్వితుడై, బంగారము, రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్లి, తరువాత భూమి మీద పుట్టి, చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి, అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ, విష్ణు, శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాధిపతి అగును. అతడు నిద్రించినచో భేరీ, శంఖాది నినాదములచే మేల్కొలుపబడును. సర్వ ధర్మ పరాయణుడై, సర్వ సౌఖ్యములను పొంది, నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి, స్వయముగా జ్ఞానియై, అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.

ఈ తిథినాడు పదహారు మాష మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము. వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడగును.

Leave a Reply