అంటురోగం కన్నా… అధైర్యమే ప్రమాదకరం!

Reading Time: 2 minutes
Lord Buddha English Short Stories For Kids with Morals - Inspiring ...
Lord Budha

మానవాళికి అంటువ్యాధుల ముప్పు ఈనాటిది కాదు. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకున్నా, జీవరాశులన్నిటితో స్నేహంగా మెలగకపోయినా ఉత్పాతాలు తప్పవు. ఇది గౌతమ బుద్ధుడు ఏనాడో చేసిన హెచ్చరిక!

బుద్ధుడు మగధ రాజధాని రాజగృహలో ఉన్న రోజులవి. ఒకనాడు కొందరు బాటసారులు ఆయన దగ్గరకు వచ్చి- ‘‘భగవాన్‌! వైశాలి రాజ్య పరిస్థితి ఘోరంగా ఉంది. వైశాలి నగరం అంటురోగాలతో అల్లాడుతోంది’’ అని చెప్పారు.

బుద్ధుడు వెంటనే తన వెంట 500 మంది భిక్షువులను తీసుకొని వైశాలికి వెళ్ళాడు. ఆ ప్రాంతం తీవ్ర అనావృష్టితో విలవిలలాడుతోంది. చెరువులు ఎండిపోయాయి. ఆ బురద నీటినే మనుషులూ, పశువులూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. నీటి కొరతతో, ఆహారం కొరతతో ఎన్నో పశువులు మరణించాయి. దుర్గంధం వ్యాపించింది. ఎంతో పశుసంపద, అటవీ సంపద యజ్ఞాలకు ఆహుతయింది. క్రమేపీ ప్లేగు, కలరా లాంటి అంటు రోగాలు ప్రబలిపోయాయి. వేల మంది మరణించారు.

బౌద్ధ సంఘం వైశాలిలో ప్రవేశించిన రోజున… అనుకోకుండా కుంభవృష్టి కురిసింది. ఎన్నో జంతు కళేబరాలు, మనుషుల శవాలు నీటి వేగంలో పడి కొట్టుకుపోయాయి. ప్రజలెవరూ బయటకు రావడం లేదు. రాజు, రాజ పరివారం కూడా ఇళ్ళకే బందీలైపోయారు. నగరాన్ని శుభ్రం చేసేవారెవరూ లేరు.

బుద్ధుడు వచ్చాడని తెలిసి, కొందరు ధైర్యం చేసి బయటకు వచ్చారు. బుద్ధుడు సరాసరి రాజ మందిరానికి చేరాడు. రాజును ఉద్దేశించి ‘‘రాజా! ఏమిటీ పని! ఎందుకీ భయం! ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రభుత్వం ఆసరా ఇప్పుడే ప్రజలకు అవసరం. మీరూ, మీ రాజోద్యోగులూ, మంత్రులూ… అందరూ నగరంలోకి వెళ్ళండి. ప్రజలను ఉత్సాహపరచండి. వారిలో ధైర్యం నింపండి. అంటురోగాల కన్నా అధైర్యమే ప్రమాదకరం. భయమే ఎక్కువ కీడు చేస్తుంది. ప్రజలు కోలుకోవడానికి యజ్ఞాలూ, యాగాలూ చేస్తే కుదరదు. వారికి ఈ పరిస్థితుల్లో కావలసిన సపర్యలు చేయాలి. వారికి తగిన ఔషధాలు అందివ్వాలి. ఈ విషయంలో మీరు సంచార ఆటవిక జాతుల నుంచి ఎంతో నేర్చుకోవాలి’’ అని చెప్పాడు.

అనంతరం తన భిక్షు సంఘంతో వీధుల్లోకి వెళ్ళాడు. భిక్షువులు నగరాన్ని మధ్యాహ్నానికల్లా శుభ్రం చేశారు. బౌద్ధ వైద్యుడు జీవకుడు తెచ్చిన ఔషధాలు ప్రజలకు అందాయి. భిక్షువులు వైద్యులుగా మారారు. ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం బుద్ధుడు వారికి కొన్ని ప్రబోధాలు చేశాడు. అవే ‘రత్న సూత్ర, మైత్రీ సూత్రాలు’గా బౌద్ధ సాహిత్యంలో నిలిచిపోయాయి.

వైశాలీ ప్రజలైన లిచ్ఛవులను ఉద్దేశించి బుద్ధుడు మాట్లాడుతూ, ‘‘వైశాలీ లిచ్ఛవులారా! ఈ భూమిపై జీవించే ప్రతి జీవీ, నేలలో, నీటిలో, గాలిలో జీవించే ప్రతి జీవీ మంచిగా బతకాలి. మంచి మనసుతో బతకాలి. మీరు నా మాట శ్రద్ధగా వినండి. సర్వజీవుల పట్ల మీరు స్నేహంతో ఉండాలి. ఆశ, అసూయలతో వాటికి ఉనికి లేకుండా చేస్తే ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి. సర్వజీవుల సుఖంలోనే మన సుఖం కూడా ఉంది. అంతేకాదు, మనిషి నిరాశలో కూరుకుపోయి లేదంటే సోమరితనంలో పడిపోయి పరులకు బరువు కాకూడదు. అలాగని ఎప్పుడూ అవిశ్రాంతంగా ‘పనులు… పనులు’ అంటూ పరుగులు తీయకూడదు. ఇంద్రియాల పగ్గాలు ఇసుమంత కూడా వదలకూడదు. ఆడంబరాలకు పోకూడదు. ఆలోచించుకొని ముందుచూపుతో బతకాలి. సంతృప్తిగా గడపాలి. లేకుంటే మనిషి అలిసిపోతాడు. అర్భకుడవుతాడు. అప్పుడు ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోలేడు’’ అంటూ అనేక ఆరోగ్య సూత్రాలనూ, జీవన గతులనూ వివరించాడు. ప్రకృతిని ధ్వంసం చేసినప్పుడు, మానవజాతి దాని కన్నెర్రకు గురికావాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ప్రకృతిని ఆశ్రయించడమే మార్గం.

సర్వజీవుల సుఖంలోనే మన సుఖం కూడా ఉంది. అంతేకాదు, మనిషి నిరాశలో కూరుకుపోయి లేదంటే సోమరితనంలో పడిపోయి పరులకు బరువు కాకూడదు. అలాగని ఎప్పుడూ అవిశ్రాంతంగా ‘పనులు… పనులు’ అంటూ పరుగులు తీయకూడదు.

Related Posts

Leave a Reply