Site icon Chandamama

చిట్టికథ – విశ్వామిత్రులు

Indian Food @pexels.com
Reading Time: < 1 minute

చిట్టికథ – విశ్వామిత్రులు

ఒకసారి తమ పితరుల శ్రాద్ధము / తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు.

దానికి విశ్వామిత్రులు, “దానికేమి, వస్తాను…. కాని నాదొక నిబంధన… మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను ” అన్నారు.

“ఈ లోకములో శ్రాద్ధ దినమునాడు వాడతగిన కూరలు వెయ్యిన్ని ఎనిమిది రకాలు ఉన్నాయా? అసలు మామూలు దినమైనా తినడానికి అన్ని రకాలు దొరుకుతాయా? ఒక వేళ ఉన్నా, ఎవరైనా అన్ని కూరలు శ్రాద్ధపు వంటలో వాడుతారా? వడ్డిస్తారా? ఒక వేళ వడ్డించినా, అన్ని ఎవరు తినగలరు? విశ్వామిత్రులు కావాలని తనను ఇరికించి అవమానించడానికే ఈ కోరిక కోరినారు…” అని వశిష్ఠులకు తెలియకపోలేదు.

అయినా కూడా, “ మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను” అన్నారు.

శ్రాద్ధ దినము రానే వచ్చింది, విశ్వామిత్రులు రానే వచ్చినారు. 

వారికి అరటి ఆకు పరచి, కాకర కాయ కూర, పనస పండు, మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి, ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది. 

వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు. 

దానికి విశ్వామిత్రులు కోపించి, ” ఇదేమిది? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి? ” అన్నారు.

దానికి వశిష్ఠులు, “నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను. మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా, అడుగుతాను, ఉండండి” అన్నారు.


వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి, ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది..

కారవల్లీ శతం చైవ, వజ్రవల్లీ శత త్రయం
పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే 

దాని అర్థము, శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకర కాయ [కారవల్లీ] నూరు కూరగాయలకు సమానము. మరియు, వజ్రవళ్ళి [నల్లేరు] పచ్చడి మూడు వందల కూరలకు సమానము… పనసపండు ఆరు వందల కూరలకు సమానము.

ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు. ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను” అంది నమస్కరించి వినయముతో.

అది విని విశ్వామిత్రులు తబ్బిబ్బై, నోటమాట రాక, భోజనము చేసి  వెళ్లారుట.

Exit mobile version