Site icon Chandamama

దక్షిణాయనం విశిష్టత

Sun Raising @Pexels
Reading Time: 2 minutes

ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు. 

దక్షిణాయనంలో పిండ ప్రదానాలు, పితృ తర్పణాలువదలడం, సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి.

సూర్య గమణాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు . భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. 

ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం.. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం.. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. 

సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.

ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. ‘అయనం’ అంటే ప్రయాణం అని అర్థం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్థం వస్తుంది. 

సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే, అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21, సెప్టెంబరు 23. 

మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. 

సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ‘ఉత్తరాయాణం’ అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ‘దక్షిణాయనం’ అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.

ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. 

ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. 

శ్రీహరి ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.

శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. 

వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. 

ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.

ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు, విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి. 

పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రాద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. 

*బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.*

ధ్యానం, మంత్ర జపాలు, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారికి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయని, పాపాలు తొలగిపోతాయని పండితులు తెలిపారు.

సర్వే జనాః సుఖినో భవంతు

Exit mobile version