Site icon Chandamama

అర్ధం కాని రామాయణం

Lord Jagannadh @pexels.com
Reading Time: < 1 minute

అర్ధం కాని రామాయణం

ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. 

“రామాయణం నీకేం అర్ధమైంది” అని అడిగింది భార్య
“నాకేం అర్ధం కాలేదు” అన్నాడు బండోడు.

ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం.

భార్యకి కోపం నషాళానికి అంటింది. 

“ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా” అంది. 
బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయి లో నీళ్ళు నిలబడవు కదా. 
అలాగే తీసుకొచ్చాడు.భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది. 

“చూసావా.. ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు.అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. 
నువ్వా గుండ్రాయితో సమానం” అని ఈసడించింది. 

అప్పుడు బండోడు అన్నాడు… “ఒసేయ్.. గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే… కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రం పడిందికదా.. 

అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పదిరోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది” అన్నాడు. 

భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది. 

నవ విధ భక్తి మార్గాల్లో “శ్రవణం” ఒకటి.

Exit mobile version