Site icon Chandamama

మన విలువ, మన నోరు చెపుతుంది

Reading Time: < 1 minute

ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు.

వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు.

ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా చూచి విక్రమాదిత్యుడు

‘సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకు ముందు వెళ్ళారా!’ అని అడిగాడు.

ఆ అంధ సాధువు ఇలా అన్నాడు:
‘మహారాజా! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడొకడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు’

అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో

మహాత్మా! మీకు నేత్రాలు కనిపించవు కదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడి నుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు?’

అంధుడైన సాధువు ఇలా చెప్పాడు:

“మహారాజా! నేనా ముగ్గురినీ, మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను.

అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో,

“ఏమిరా, గుడ్డివాడా! ఇటు ఎవరైనా వచ్చారా?” అని అడిగాడు.

కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి,
’సూర్ దాస్, ఇటు ఎవరైనా వెళ్ళారా?’ అని అడిగాడు.

చివరకు మీ మంత్రి వచ్చి
‘సూర్ దాస్ జీ ఇటు ఎవరైనా వెళ్ళారా?’ అని అడిగారు.

మీరు వచ్చి
‘సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకు ముందు వెళ్ళారా!’ అని అడిగారు.

“మహారాజా! ఒక వ్యక్తి యొక్క వాక్కు ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ, ఏమిటో గుర్తించవచ్చు”

మన విలువ, మన నోరు చెపుతుంది

Exit mobile version